ASBL NSL Infratech

రాజ్యసభ బరిలో టీడీపీ... వైసీపీకి టెన్షన్..!

రాజ్యసభ బరిలో టీడీపీ... వైసీపీకి టెన్షన్..!

ఒకవైపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. సాధారణంగా అసెంబ్లీలో సీట్ల బలాబలాలను బట్టి రాజ్యసభ సీట్లు దక్కుతుంటాయి. అయితే ఏపీలో పరిస్థితి వేరు. చాలా మంది ఎమ్మెల్యేలు అటుఇటు జంప్ అయ్యారు. దీంతో అధికార వైసీపీలో పూర్తిస్థాయి ధీమా కరువైంది. మరోవైపు టీడీపీ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధం కావడంతో వైసీపీకి మరింత టెన్షన్ మొదలైంది.

ఆరు నెలల కిందట శాసనమండలి ఎన్నికలు అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. సంఖ్యాబలాన్ని బట్టి అన్ని స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లు గుర్తించి వైసీపీ ఖంగుతింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తుతుందేమో అనే టెన్షన్ వైసీపీలో నెలకొంది. మండలి ఎన్నికల సమయంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు మరింత మారడమే ఇందుకు కారణం.

3 రాజ్యసభ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. తమ పార్టీ తరపున వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలను బరిలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. వీళ్లు ముగ్గురూ గెలవాలంటే 132 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. వాస్తవానికి వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే వీళ్లలో కొంతమంది పార్టీకి దూరమయ్యారు. గతంలో నలుగురు ఎమ్మెల్యేలు దూరంకాగా అనర్హత వేటు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పలువురు సిట్టింగులకు జగన్ టికెట్లు నిరాకరించడంతో వాళ్లంతా ఎక్కడ క్రాస్ ఓట్ వేస్తారో అనే భయం వైసీపీలో మొదలైంది. దాదాపు 30 మంది సిట్టింగులకు ఇప్పుడు సీట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్లందరినీ బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం.

మరోవైపు మండలి ఎన్నికల్లో లాగానే రాజ్యసభ ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని టీడీపీ ఆశిస్తోంది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ సైకిలెక్కేశారు. ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 44 ఓట్లు కావాలి. వైసీపీ అసంతృప్తులకు తోడు టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు కలిస్తే తప్పకుండా గెలుపు సాధ్యమేనని టీడీపీ భావిస్తోంది. పైగా ఇలాంటి విషయాల్లో ఎత్తులు పైఎత్తులు వేయడంలో చంద్రబాబు దిట్ట. అందుకే వైసీపీకి టెన్షన్ పట్టుకుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :