షర్మిల హడావుడి..! విజయమ్మ, జగన్ దారెటు..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ అనేక మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్ బిడ్డలిద్దరూ చెరోదారి చూసుకోవడంతో రాజకీయం ఏ ఒడ్డుకు చేరుతుందనేది అంతు చిక్కడం లేదు. జగన్ సొంత పార్టీ పెట్టుకోగా, షర్మిల తండ్రి బాటలో పయనిస్తున్నారు. దీంతో తల్లి విజయమ్మ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేసున్నారు. దీంతో విజయమ్మ, జగన్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాది. జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. చివరకు ఆ పార్టీ ముఖ్యమంత్రిగానే కాలం చేశారు. ఆయన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. ఆయన మరణానంతరం కూడా సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ తరపునే పోటీ చేశారు. అయితే కుమారుడు జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి బయటకు వచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలపై పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. అప్పుడు వైఎస్ ఫ్యామిలీ మొత్తం జగన్ కు అండగా నిలిచింది. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా జగన్ వెంటే నడిచారు.
ఫ్యామిలీలో విభేదాలు రావడంతో జగన్ ను నుంచి విడిపోయి షర్మిల బయటికొచ్చేశారు. మొదట తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. చివరకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్నారు. దీంతో సొంత సోదరుడిపైనే పోరుబాట పట్టాల్సి వచ్చింది. కడపలో కాలు దువ్వి జగన్ పార్టీకి భారీగానే నష్టం చేకూర్చింది. వైసీపీ ఓడిపోయింది. అయినా అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ మాత్రం ఇంకా తగ్గలేదు. చివరకు తల్లి విజయమ్మ కూడా వీళ్లిద్దరి మధ్యలో నలిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆమె జగన్ దగ్గర కంటే షర్మిల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతోందనే టాక్ వినిపిస్తోంది.
ఏపీలో తన సత్తా చాటాలని, వైఎస్ఆర్ అసలైన వారసురాలు తనేనని నిరూపించుకోవాలని షర్మిల తహతహలాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో ఈ నెల 8న ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను కూడా షర్మిల ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి విజయమ్మ కూడా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ నేతలతో కలిసి విజయమ్మ వేదికను పంచుకున్నట్టవుతుంది. ఒకవేళ విజయమ్మ ఈ కార్యక్రమానికి హాజరైతే నైతికంగా జగన్ కు పెద్ద దెబ్బ తగిలినట్లే.
మరోవైపు తండ్రి జయంతి వేడుకలను సోదరి షర్మిల ఘనంగా నిర్వహిస్తుంటే తాను పట్టించుకోవట్లేదనే అపవాదును కూడా జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. షర్మిల చేస్తోంది కాబట్టి ఇప్పుడు నిర్వహిస్తే ఇన్నాళ్లు పట్టించుకోని జగన్, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడనే మాటలను కూడా పడాల్సి వస్తుంది. గతంలో లాగా ఇగ్నోర్ చేస్తే తండ్రిపై ప్రేమ లేదని, కేవలం ఎన్నికల్లో మాత్రమే తండ్రి ఫోటో పెట్టుకుంటారనే విమర్శలు వస్తాయి. ఇలా సోదరి షర్మిల.. జగన్ ను ముప్పతిప్పలు పెడుతోందని చెప్పొచ్చు. వీళ్లిద్దరి మధ్యలో విజయమ్మ సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది.