చెల్లెమ్మలతో యుద్ధం..
కడప ఎంపీ ఎన్నికల ముఖచిత్రంపై ఫుల్లు క్లారిటీ వచ్చింది. ఓవైపు నేనంటూ వైసీపీ తరపున అవినాష్ రెడ్డి నిల్చుంటున్నారు. అవినాష్ రెడ్డికి పార్టీతో సీఎం జగన్ అండ ఉంది. గెలుపు మాదేనంటున్నారు కడప వైసీపీ శ్రేణులు. లక్షల మెజార్టీ లెక్కేస్తున్నారు. అవతల ఎవరు నిలిచినా, మళ్లీ పూలబుట్టతో ఎంపీ సీటు.. సీఎం జగన్ కు అందిస్తామంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఓలెక్క.. ఇక నుంచి ఓ లెక్కంటోంది వైఎస్ షర్మిల.
కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు షర్మిల. పోటీ చేయడమంటే ఆషామాషీగా కాదు.. నేరుగా సీఎం జగన్ పై అస్త్రాలు సంధిస్తున్నారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ .. కడప ఎంపీ టికెట్ ఇచ్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసు. నేను పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నా. గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారు. నా అనుకున్న వాళ్లను జగన్ నాశనం చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. మా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్ వారిని కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్ వైకాపా టికెట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానన్నారు షర్మిల.
గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయ కోసం వాడుకుంది. హత్య చేయించిన వారికి టికెట్ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్ ఇచ్చారు. వివేకా చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలి. ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా. సునీత కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోంది. హంతకుడైన అవినాష్‌రెడ్డిని చట్ట సభలో అడుగుపెట్టకుండా చేయడమే నా లక్ష్యం. కడంపలో అతను గెలవకూడదు అంటే నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు.
మరోవైపు....ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని.. పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్, వైకాపా నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు. తప్పును గ్రహించానని.. దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్ మాటలతో ప్రతిసారీ అందర్నీ మోసం చేయలేరన్నారు.
‘‘వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో.. ఎవరు చేయించారో మీకూ తెలిసినట్లే కదా! అది ఎందుకు బయటపెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే.. ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? డిబేట్ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు’’ అని సునీత వ్యాఖ్యానించారు.ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.