ASBL NSL Infratech

జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్..?

జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్..?

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు కనీవినీ ఎరుగని ఓటమిని చవిచూసింది. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు రావడంతో ఎద్దేవా చేసింది వైసీపీ. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కేంద్రంలో కూడా టీడీపీ కూటమే అధికారంలోకి రావడంతో వైసీపీ భవిష్యత్తు ఏంటనేది అంతు చిక్కడం లేదు.

2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఐదేళ్లూ తామె చెప్పిందే వేదం అన్నట్టు నడిచింది. కేంద్రంలో కూడా తమకు అనుకూలంగా ఉన్న బీజేపీ అధికారంలో ఉంది. దీంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందుల్లేవు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ, జనసేన జట్టుకట్టాయి. వైసీపీని ఓడించాయి. పైగా రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా బీజేపీయే పగ్గాలు చేపడుతోంది. టీడీపీ కూడా అందులో భాగస్వామ్యం కాబోతోంది. దీంతో ఇన్నాళ్లూ బీజేపీతో ఉన్న స్నేహం కూడా లేకుండా పోయింది.

ఐదేళ్లలో టీడీపీని దారుణంగా ఇబ్బంది పెట్టినట్టు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దానికి ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ఫలితాలు వెలువడిన రోజు నుంచే టీడీపీ కార్యకర్తలు పలు చోట్ల వైసీపీపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇక అధికారం చేపడితే పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వైసీపీని వెంటాడుతోంది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే కేంద్రానికి చెప్పుకుని లబ్ది పొందే అవకాశం కూడా లేకుండా పోయింది. అక్కడ కూడా టీడీపీ కూటమే అధికారంలో ఉండనుంది. అలాంటప్పుడు వైసీపీకి సాయం అందుతుందని చెప్పలేం.

గతంలో చంద్రబాబు హయాంలో జగన్ ను చూసీచూడనట్లు వెళ్లారు. అందుకే ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగలేదు. కానీ జగన్ పాలనలో టీడీపీ నేతలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. ఇలాంటి వాటన్నింటిపైనా విచారణ జరిపేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే వైసీపీకి అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై బదిలీ వేటు పడింది. 12న చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వైసీపీ అక్రమాలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :