గుంటూరు పశ్చిమలో ఫ్యాన్ పరిస్థితి ఏమిటో..?
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటైతే తెచ్చుకున్నారు కానీ మంత్రి విడదల రజినీకి అసమ్మతి స్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్గతంగా చాపకింద నీరులా అసమ్మతి నేతలు రాజకీయం చేస్తుండడంతో.. వారు ఈసారి కలిసొస్తారా అన్న భయం .. రజనీ వర్గంలో కనిపిస్తోంది. పైన జగనన్న అండ ఉన్నప్పటికీ.. తమపై రజినీ ఆధిపత్యాన్ని అసమ్మతి నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళిగిరి వర్గం ఏం చేస్తుందో అన్న టెన్షన్ .. రజినీవర్గంలో ఆందోళనకు కారణమవుతోంది.
లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తదితరులకు నియోజకవర్గంతో అనుబంధం ఉంది. రాబోయే ఎన్నికల్లో వీరందరి సహకారం రజనీకి చాలా కీలకం.. అందరూ ఏకతాటిపై ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా నియోజకవర్గంలో వారి హవా, ఆధిపత్యం, ప్రభావానికి ఢోకా లేకుండా చూసుకోవడానికి ఎవరికి వారు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దశాబ్దాలుగా నియోజకవర్గంతో అనుబంధం ఉన్న లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన మద్దాళి గిరి ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. చంద్రగిరి యేసురత్నం 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వేణుగోపాల్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరందరూ గుంటూరు నగరం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తుండడంతో నియోజకవర్గంలో వారందరికీ ఎంతోకొంత ప్రత్యేక అనుచర వర్గం పశ్చిమ నియోజకవర్గం నుంచి ఐదుగురు నేతలు ఎవరి స్థాయిలో వారు పట్టు కోల్పోకుండా వారి ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందరూ ఒకే వేదికపై పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రకటిస్తున్నా తెర వెనుక ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారు.
అయితే..మంత్రితో కలిసి మద్దాళి గిరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో మంత్రి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయడంతో పాటు అందరినీ కలుస్తున్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, వివిధ సామాజికవర్గాల నేతలతో వరుస సమావేశాలు పెడుతున్నారు. దశాబ్దానికి పైగా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఒకరు తన పట్టు కోల్పోతే తన ఆధీనంలో ఉన్న వ్యాపారాలు, ఇతరత్రా లావాదేవీలకు గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగస్వామ్యమున్న అనుచరులతో సమావేశమై భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న విషయమై సమాలోచనలు జరపడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన నేత కొందరు కార్పొరేటర్లు, అనుచరులతో విందు సమావేశం నిర్వహించి అభిప్రాయాలు పంచుకున్నారు.
డిసెంబర్ 31 రాత్రి నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. దాడిపై టీడీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసినా వైసీపీ నేత అనుచరులు కూడా కార్యాలయంపై దాడిలో పాల్గొన్నారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి దూకుడును జీర్ణించుకోలేక తెర వెనుక పావులు కదిపారన్న ప్రచారం ఉంది.. మంత్రి రజిని రాకతో అధికార పార్టీలో నేతల వద్దకు వస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు కొందరు అటువైపు వెళ్తుండడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో ఎవరికివారు వారి ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు నగరం కేంద్రంగా రాజకీయం ఊపందుకోవడంతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది నేతలు ఉండడంతో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.