ASBL NSL Infratech

కేసీఆర్ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారా..? 

కేసీఆర్ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారా..? 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పార్టీ పెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అనేక ఉద్యమాల అనంతరం ఆయన రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ పితగా పేరొందుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేళ్లపాటు ఆయన అధికారం చెలాయించారు. పాతికేళ్లపాటు కేసీఆర్ పేరు లేని తెలంగాణను ఊహించుకోలేం. కానీ ఈ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆయన పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు కేసీఆర్ కూడా మౌనంగా ఉండిపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజకీయాలన్నాక జయాపజయాలు సహజం. ఒక ఎన్నికలో గెలవచ్చు.. మరో ఎన్నికలో ఓడిపోవచ్చు. వీటిని సమానంగా తీసుకుని పోరాడినప్పుడే రాజకీయాల్లో ఫలితాలు చూడొచ్చు. అలా కాకుండా గెలిచినప్పుడు పెత్తనం చెలాయించి ఓడిపోయినప్పుడు పలాయనవాదం అనుసరిస్తే రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టం. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎవర్నీ లెక్కచేయలేదు. ప్రతిపక్షాలకు అసలు గౌరవమే ఇవ్వలేదు. తెలంగాణను తన కంపెనీగా ఫీలై పెత్తనం చెలాయించారు.

పదేళ్లలో కేసీఆర్ సర్కార్ కు ఎదురే లేకుండా పోయింది. ఆయన చెప్పిందే వేదం. ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎవరైనా విమర్శలు చేస్తే వారి అంతు చూసే వరకూ నిద్రపోలేదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. సహజంగా ఇలా ఓడిపోయినప్పుడు నేతలెవరైనా గెలిచినవారిని అభినందిస్తుంటారు. నేరుగా కాకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తుంటారు. కానీ కేసీఆర్ ఇందుకు భిన్నం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ సర్కార్ ను కానీ అభినందించలేదు. కనీసం ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ గెలిచింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కనీసం మోదీని కూడా విష్ చేయలేదు. విషెస్ సంగతి పక్కన పెడితే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. ఎక్కడ తప్పు జరిగిందో బేరీజు వేసుకుంటాం.. అనే మాట కూడా లేదు కేసీఆర్ నోటి నుంచి.! ఒక పార్టీ అధినేతగా ఉండి.. పదేళ్లపాటు అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తి బాధ్యతలు కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తాడేమోననే టాక్ తెలంగాణలో జోరుగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :