అఖిల్ మౌనానికి కారణమేంటి?
అఖిల్ అక్కినేని తర్వాతి సినిమా అప్డేట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ సగటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం ఈ విషయంలో తనకేమీ పట్టనట్లు కనిపిస్తున్నాడు. గతేడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్న అఖిల్ ఆ తర్వాత మీడియా ముందు ఎక్కువగా కనిపించింది లేదు.
అఖిల్ కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్పించి చెప్పుకోదగ్గ హిట్ లేదు. కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ చూసిన అఖిల్ తన తర్వాతి సినిమా కోసం ఏదో కొత్త మేకోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్ చేసి మేకోవర్ కోసం టైమ్ తీసుకుంటే బావుంటుంది కానీ అసలు సినిమా అనౌన్స్ చేయకుండా ఇలా మౌనం వ్యవహరించడం వల్ల అఖిల్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
ఓ వైపు నాగ చైతన్య సినిమా తర్వాత సినిమా చేస్తూ ఫ్యాన్స్ ను మెప్పిస్తుంటే అఖిల్ మాత్రం ఇలా సైలెంట్ గా ఉండటం బాలేదు. ఇప్పటివరకు సరైన హిట్ అందుకోని అఖిల్, ఈసారి సినిమా చేస్తే మాత్రం సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడట. అఖిల్ తో హోంబలె ఫిల్మ్స్ ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తుందని టాక్. దీని గురించి గత ఆరు నెలలుగా మీడియాలో వార్తలొస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మరి అఖిల్ తన తర్వాతి సినిమా విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడో తెలియాల్సి ఉంది.