ASBL NSL Infratech

రివ్యూ : సిల్లీ (స్క్రీన్ పొలిటికల్ డ్రామా) ‘వ్యూహం’

రివ్యూ : సిల్లీ (స్క్రీన్ పొలిటికల్ డ్రామా) ‘వ్యూహం’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థలు : రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్, 
నటీనటులు: అజ్మల్ అమీర్, మానస రాధా కృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం తదితరులు
సినిమాటోగ్రాఫర్‌: సజీస్ రాజేంద్రన్, సంగీత దర్శకులు: ఆనంద్
ఎడిటింగ్: మనీష్ ఠాకూర్, నిర్మాత  : దాసరి కిరణ్ కుమార్
దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్
విడుదల తేదీ : 02.03.2024
నిడివి : 2 ఘంటల 2 నిముషాలు  

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ దర్శకత్వం వహించిన 'వ్యూహం' పలు అడ్డంకులు దాటుకుని ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ జంటగా నటించారు. దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో వర్మ ఏం చెప్పారు? అనేది రివ్యూలో చూద్దాం.  

కథ:

హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ సీఎం డా.వై ఎస్ రాజా శేఖర రెడ్డి, మరణం తరువాత జరిగిన రాజకీయ పరిస్థితుల్ని తన కోణంలో చూపించాడు వర్మ.  సినిమాలో  వీర శేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు పుట్టెడు దుఖంలో ఉన్నజగన్ మోహన్ రెడ్డి సినిమాలో  (అజ్మల్ అమీర్)ను ముఖ్యమంత్రిని  చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. ఆ ప్రతిపాదనను కాదని రోశయ్య సినిమాలో కాశయ్య ను ఏపీకి సీఎం చేస్తుంది భారత్ పార్టీ మేడం. మదన్ చేపట్టిన ఓదార్పు యాత్ర సైతం ఆపమని చెబుతుంది. హైకమాండ్, భారత్ పార్టీని లెక్క చేయకుండా మదన్ ముందుకు వెళతాడు. వీసీపీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళతాడు. దాంతో అతని మీద కేసులు, ఇన్వెస్టిగేషన్లు మొదలవుతాయి.  తనపై వచ్చిన కేసులను ఎదుర్కొని, ప్రత్యర్థులను తట్టుకుని మదన్ ఎలా సీఎం అయ్యాడు? భార్య మాలతి (మానస రాధాకృష్ణన్), తల్లి జయమ్మ (సురభి ప్రభావతి), చెల్లెలు నిర్మల (రేఖా నిరోషా) నుంచి ఎటువంటి సహకారం లభించింది. 2019 ఎన్నికల్లో మదన్ ఎలాంటి వ్యూహం పన్ని తిరుగులేని విజయాన్ని అందుకున్నారన్నదే ఈ సినిమా. ఇక ఇప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సినిమాలో తారా ఇంద్రబాబు నాయుడు (ధనుంజయ్ ప్రభునే)  అధికారాన్ని చేపట్టడం కోసం పవన్ కళ్యాణ్ సినిమాలో శ్రవణ్ కళ్యాణ్‌  (చింటూ) తో చేతులు కలిపి యుకుక్తులు పన్నుతుంటాడు. వీళ్లందరి ఆట కట్టిస్తూ.. మదన్ ఎలా ఎదుర్కున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల హావభావాలు :

నటీనటుల విషయానికి వస్తే.. మదన్ మోహన్ రెడ్డిగా అజ్మల్ అమీర్ చాలా బాగా నటించాడు. ఒరిజినల్ పాత్రకు అనుగుణంగా అజ్మల్ అమీర్ ఇచ్చిన హావభావాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మానస రాధా కృష్ణన్ కూడా చాలా బాగా నటించింది. ఇంద్రబాబు పాత్రలో నటించిన నటుడు కూడా ఆ పాత్రకు పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అలాగే ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, వాసు ఇంటూరి, కోట జయరాం లతో పాటు మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఎవ్వడి సినిమాకి ఆడే హీరో అన్నట్టుగా.. వర్మ సినిమా అంటే నిజానిజాలు పక్కనపెట్టేయాల్సిందే. మీరు చూస్తే చూడండి.. లేదంటే మానేయండి.. నా సినిమా చూడమని చెప్పను.. అంటూనే పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్టుగా ప్రచారం కల్పిస్తుంటారు వర్మ. ఆయన ఏ సినిమా చేసినా వివాదం ఎక్కువ.. కంటెంట్ తక్కువ అనేట్టుగా ఉన్నాయి ఇటీవల కాలంలో చిత్రాలు. ప్రస్తుతం రణరంగంగా మారిన ఏపీ ఎన్నికల హీట్‌లో ‘వ్యూహం’ సినిమాని వైసీపీ ప్రచారం అస్త్రంగా వదిలాడు వర్మ. వర్మ కోణంలో చూస్తే వ్యూహం వైసీపీ ఫ్యాన్స్‌కి విందులా అనిపిస్తుంది. ఆర్జీవీ చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయాడు. సంగీత దర్శకుడు ఆనంద్ సమకూర్చిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సజీస్ రాజేంద్రన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత రామదూత క్రియేషన్స్, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ:

'వ్యూహం' సినిమా ప్రారంభంలో కల్పిత కథ, పాత్రలతో తీశామని చెప్పినా సరే... కథ ఏమిటనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది చిత్ర కథాంశం. మహి వి రాఘవ్ తీసిన 'యాత్ర 2' కథాంశం కూడా అదే. మరి, రెండు సినిమాల మధ్య వ్యత్యాసం ఏమిటి? అంటే... 'యాత్ర 2'లో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సహా నారా లోకేష్, వైఎస్ షర్మిల పాత్రలు లేవు. రామ్ గోపాల్ వర్మ వాళ్లను తన సినిమాలో చూపించారు. షర్మిల పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు గానీ... మిగతా పాత్రలపై సన్నివేశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? సినిమాలో ఏముంది? అనేది చూస్తే...ఉప్చ్! కథలో నిజా నిజాలు పక్కనపెడితే.. జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా వేధించింది.. చంద్రబాబు కుట్రలకు పవన్‌తో సహా ఎంతమంది బలి అయ్యారనే విషయాన్ని కళ్లకి కట్టే ప్రయత్నం చేశాడు వర్మ.

తనతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబే ఓడించడం వెనుకనున్న వ్యూహాన్ని కొత్త కోణంలో చూపించాడు. ఇక అరెస్ట్‌లు కేసులకు లొంగకుండా.. ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో జగన్‌లోని అసలుసిసలు నాయకుడ్ని కళ్లకి కట్టారు. ఇంత వరకూ ఓకేకానీ.. గతంలో వైసీపీకి అనుకూలంగా వచ్చిన యాత్ర కానీ.. యాత్ర 2 కానీ.. జనానికి నచ్చాయంటే.. అందులో నటించిన నటీనటులే కాకుండా.. ప్రతి సీన్‌కి బలమైన నేపథ్యం ఉంటుంది. రియల్ ఎమోషన్స్ కనిపిస్తాయి. కానీ వ్యూహం వాటికి పూర్తి భిన్నం. నాటకాన్ని తలపించేలా నటీనటుల హావభావాలు ఈ సినిమాలో సీరియస్ నెస్ లేకుండా చేసింది. ఓవరాల్ గా ఈ వ్యూహం సినిమాలో కొన్ని అంశాలు వైసీపీ అభిమానులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :