ఏపీలో వెల్లివిరిసిన 'జనచైతన్యం'..
ఏపీలో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. దాదాపు 80 శాతానికిపైగా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పెద్దఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలిన ఓటర్లు.. తమకు నచ్చిన నేతకు, నచ్చిన ప్రభుత్వానికి ఓటేశారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ఓటు వేయడం ఎలా సాధ్యమైంది. ఈసరళిలో ఓటు నమోదుకు కారణాలేంటి..?
ముందుగా చెప్పుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి.. మొదటి నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజలకు ఎప్పటికప్పుడు విజ్ఞప్లులు చేస్తూ వచ్చింది. పబ్లిక్ యాడ్స్, ఫోన్లకు మెసేజ్ లు, ప్రముఖులు, సినీనటులు, టీవీ యాక్టర్స్ సాయం తీసుకుంది. దీనికి తోడు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని చేజార్చుకోవద్దంటూ.. ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఈసీ విజయం సాధించిందని చెప్పొచ్చు..
ఇక ఈ ఎన్నికలను పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు వైనాట్ 175 అంటూ సీఎం జగన్.. శ్రేణులకు మార్గదర్శనం చేశారు. తమపార్టీకి అండగా నిలిచిన ఓటర్లు ఓటేయని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశ్యంతో .. వారు ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లను చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. దీనికి తోడు సంక్షేమపథకాలను అందిస్తున్న సర్కార్ ను దూరం చేసుకోకూడదన్న స్పృహ సైతం కొందరిని ఓటింగ్ కేంద్రాలకు కదిలివచ్చేలా చేసింది. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు సైతం కేంద్రాలకు రావడంతో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా చేసింది.
మరోవైపు కూటమి తరపున ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. దీంతో ఆపార్టీ నేతలకు ఎలక్షన్ ఇంజినీరింగ్ పై చంద్రబాబు గైడెన్స్ ఇచ్చారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటర్లకోసం ఏసీ బస్సులు పెట్టారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులు సైతం పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈసారి గెలవకుంటే ఇక ఇక్కడ ప్రతిపక్షానికి చోటుండదన్న ఆందోళన సైతం వారిలో కనిపించింది. దీనికి తోడు హైదరాబాద్ నుంచి సైతం ఈసారి పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటేసిన పరిస్థితులు కనిపించాయి. వీటన్నింటితో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందని చెప్పవచ్చు.