అలాంటి కథ కోసం చూస్తున్న మెగా హీరో
మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు వైష్ణవ్. ఉప్పెన మంచి హిట్ అవడంతో వైష్ణవ్ సినిమాల మీద బాగా క్రేజ్ పెరిగింది. కానీ ఆ తర్వాత వైష్ణవ్ నుంచి వచ్చిన మూడు సినిమాలూ ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. మొదటి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న వైష్ణవ్, ఆ తర్వాత అవేమీ చూసుకోకుండా సినిమాలు చేసి కెరీర్ ను రిస్క్ లో పెట్టుకున్నాడు.
వైష్ణవ్ నుంచి చివరిగా వచ్చిన ఆదికేశవ సినిమా కూడా ఘోరమైన ఫ్లాప్. కథగా విన్నప్పుడు బాగుందనుకుని వైష్ణవ్ చేస్తున్న ప్రతీ సినిమా ఫ్లాపే అవుతుంది. అందుకే ఆదికేశవ తర్వాత వైష్ణవ్ కెరీర్ డైలమాలో పడింది. దీంతో ఎలాగైనా ఒక మంచి కథను ఎంచుకుని తర్వాతి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు వైష్ణవ్. అందుకే కథలు చెప్పడానికి తన దగ్గరకొచ్చిన వారికి ఏ మాత్రం అనుమానమున్నా మొహమాటం లేకుండా నో చెప్తున్నాడట.
ఆదికేశవ తర్వాతి నుంచి వైష్ణవ్ మంచి కథ కోసం వారానికి ఐదారు కథల వరకు వింటున్నట్లు తెలుస్తోంది. కానీ వాటిలో ఏదీ వైష్ణవ్ కు నచ్చడం లేదని సమాచారం. వైష్ణవ్ కెరీర్, మార్కెట్ బాగా డల్ అయిన నేపథ్యంలో మళ్లీ తనకు ఉప్పెన లాంటి సినిమా వస్తే తప్పించి కెరీర్ గాడిలో పడే అవకాశం లేదు. మరి ఇన్నాళ్లు వెయిట్ చేసిన వైష్ణవ్ ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తాడో చూడాలి.