భారత్ కు తహవ్వుర్ రాణా.... అమెరికా

ముంబయి దాడుల ( 26/11)ల కీలక నిందితుల్లో ఒకడైన తహవ్వుర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించింది. రాణా విడుదలకు అంగీకరిస్తూ అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు న్యాయమూర్తి జాక్వెలిన్ చూజన్ ఈ నెల 16న 48 పేజీల తీర్పు వెలువరించారు. భారత్`అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా 62 ఏళ్ల రాణాను భారత్‌కు అప్పగించవచ్చని తీర్పులో పేర్కొన్నారు. పాకిస్థాన్ మూలాలున్న కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రాణా ముంబయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
2008లో జరిగిన ముంబయి దాడుల్లో అతడి పాత్రపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా అతడిని అప్పగించాలని జూన్ 10, 2020న అమెరికాను భారత్ కోరింది. రాణా అప్పగింత వ్యవహారంలో బైడెన్ ప్రభుత్వం భారత్‌కు సానుకూలంగా వ్యవహరించింది. ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలోనే షికాగో కోర్టు రాణాకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రాణా డౌన్‌టౌన్ లాస్‌ఏంజెలెస్ ఫెడరల్ లాకప్‌లో ఉన్నాడు. జిల్లా కోర్టు తీర్పును అతను సర్య్కూట్ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. అమెరికా చట్టం ప్రకారం నిందితుడి అప్పగింతపై తుది నిర్ణయం ఆ దేశ విదేశాంగ మంత్రిదే కావడం గమనార్హం.