MKOne Telugu Times Youtube Channel

రియాల్టీలో టాప్ హైదరాబాద్

రియాల్టీలో టాప్ హైదరాబాద్

హైదరాబాద్‌ లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ డిమాండ్‌ ఉంది హైదరాబాద్‌లోనే  అని తాజా నివేదికలు కూడా సూచిస్తున్నాయి. రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ విక్రయాల్లో బెంగళూరు ముంబైలను అధిగమించి హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. కొత్త ఇళ్ల అమ్మకాల్లోనూ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. తద్వారా రియాల్టీ విభాగంలో మరోసారి సత్తా చాటింది. భాగ్యనగరంలో రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ వృద్ధికి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన ఐటీ పరిశ్రమతోపాటు పెరుగుతున్న యువ నిపుణులు వంటి అనేక అంశాలు కారణమని చెప్పొచ్చు. తాజాగా మొత్తం 66683 యూనిట్ల కొత్త లాంఛ్‌ లతో బెంగళూరు ముంబై నేవీ ముంబై చెన్నై సహా ఇతర నగరాలను హైదరాబాద్‌ వెనక్కి నెట్టినట్లు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ  ప్రాప్‌ ఈక్విటీ నివేదించింది.

దేశవ్యాప్తంగా చూస్తే అన్ని నగరాల కంటే హైదరాబాద్‌ లో రియల్‌ భూమ్‌ భారీగా పెరుగుతోంది. హైదరాబాద్‌ లో ఇళ్ల ధరలు ఈ జూన్‌ త్రైమాసికంలో 12శాతం పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌ ఈక్విటీ వెల్లడిరచింది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ చదరపు అడుగు ధర రూ.5760 ఉండగా.. ఇప్పుడు రూ.6472కు చేరిందని పేర్కొంది. ఇళ్ల విక్రయాల్లోనూ 77 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 8176 ఇళ్లు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 14457కు చేరింది. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం చదరపు అడుగులకు రూ.5900 నుంచి రూ.6100 వరకు ఉంది. గతేడాది క్యూ4లో అహ్మదాబాద్‌ తో సహా నగరంలో అత్యధిక ధరలు నమోదయ్యాయని ప్రాప్‌ టైగర్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌ పేర్కొన్నారు. 

 

 

Tags :