Radha Spaces ASBL

టిఎల్‌సిఎ ఉగాది వేడుకలు... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

టిఎల్‌సిఎ ఉగాది వేడుకలు... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) అధ్యక్షులు నెహ్రూ కఠారు, చైర్మన్‌ డా. ప్రసాద్‌ అంకినీడు ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు ఇటీవల వైభవంగా జరిగాయి. న్యూయార్క్‌లోని స్థానిక హిందూ టెంపుల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా లో అశేష తెలుగు ప్రజల మధ్య నిర్వహించిన ఈ వేడుకలను గణపతి స్తోత్రంతో ప్రారంభించారు. పండితుల పంచాంగ శ్రవణం తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. తెలుగుభాషకి సంబంధించిన నాటికలు, శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి పాటలు మరియు నృత్యాలతో ఆద్యంతం వేదిక ప్రాంగణం హోరెత్తింది. కార్యక్రమాల వరుస కూడా ఎక్కడా బోర్‌ కొట్టకుండా కల్చరల్‌ టీం చక్కని ప్రణాళికతో అందరినీ ఆహ్లాదపరిచారు. పల్లె వాతావరణం, ఉగాది పండుగ సందర్భాన్ని కలగలిపి సుమారు 30 మంది పిల్లలు చేసిన ప్రోగ్రాం ఆకట్టుకుంది. రామాయణాన్ని ఉటంకిస్తూ శ్రీ సీతారాముల అరణ్యవాసం, అనంతర పట్టాభిషేకంపై ప్రదర్శించిన నాటకం బహు బాగు. ‘పద్యానికి పట్టం’ కార్యక్రమం విషయంలో మాత్రం చిన్నారుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చిన్నారులు మన సంస్కృతిని మరిచిపోకుండా ఉండేలా వారిచేత సాధన చేయించి అద్భుతంగా ప్రదర్శించారు.

ఇక ‘మాయాజూదం’ కార్యక్రమం  అన్నీ కార్యక్రమాల్లో కన్నా హైలైట్‌గా నిలిచింది. టి.ఎల్‌.సి.ఎ సభ్యులు ప్రతి పాత్రకి తగ్గ దేహ ధారుడ్యం, అలంకరణ, నటనతో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ధర్మరాజు, భీముడు వంటి పలు పాత్రలకు జీవం పోశారు. భోజన కమిటీ ఉగాది పచ్చడి మొదలుకుని షడ్రుచుల సమ్మేళనంగా పండుగ భోజనం అందించింది. ఎప్పటిలానే డిజిటల్‌ స్క్రీన్‌, ఫోటో బూత్‌ రిచ్‌ లుక్‌ ని తీసుకొచ్చాయి. యాంకర్‌ వంశీ ప్రియ ధర్మరాజు  పదునైన వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు.

టి.ఎల్‌.సి.ఎ కార్యదర్శి డా. నాగేంద్ర గుప్త తన తోటి బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌లను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, టి.ఎల్‌.సి.ఎ ఈస్‌ మదర్‌ ఆఫ్‌ ఆల్‌ తెలుగు ఆర్గనైజషన్స్‌ అంటూ సంస్థ విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు కిరణ్‌ రెడ్డి పర్వతాల, కార్యదర్శి సుమంత్‌ రాంశెట్టిని మెచ్చుకున్నారు. అనంతరం టి.ఎల్‌.సి.ఎ ఛైర్మన్‌ డా. ప్రసాద్‌ అంకినీడు మాట్లాడుతూ మన చిరకాల స్వప్నం టి.ఎల్‌.సి.ఎ కి సొంత భవనం సమకూర్చడం, ఈ దిశగా అందరూ విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటి లయని డా. పూర్ణ అట్లూరి  మెమెంటోతో, అరుంధతి అడుప పుష్ప గుచ్ఛంతో, మాధవి కోరుకొండ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ టి.ఎల్‌.సి.ఎ కి రావడం ఇది మూడోసారని, ప్రతి సారి ఒక కొత్త అనుభూతిలా ఉంటుందని అన్నారు. లయ తను నటించిన స్వయంవరం చిత్రంలోని ‘కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం’ అంటూ పాట పాడి అందరినీ అలరించింది. అలాగే మద్దిపట్ల ఫౌండేషన్‌ వారు సమర్పించిన ర్యాఫుల్‌ బహుమతులను గెలుచుకున్నవారికి నటి లయ చేతులమీదుగా అందించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ని టి.ఎల్‌.సి.ఎ కార్యవర్గం మరియు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానించి కరత్వాళ ధ్వనుల మధ్య సత్కరించింది. ట్రేడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మరియు ఇన్నోవేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌ చౌహాన్‌, మేయర్‌ని పరిచయం చేస్తూ, ప్రతి న్యూయార్క్‌ వాసి జీవితాలను మెరుగుపరిచేందుకు మేయర్‌ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ టి.ఎల్‌.సి.ఎ బృందం అద్భుతంగా కార్యక్రమాలను ప్రదర్శించినందుకు అధ్యక్షుడు నెహ్రూ కటారును అభినందించారు. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు కమ్యూనిటీలు కలిసి వచ్చేలా ప్రోత్సహించడం మరియు ప్రాంతం యొక్క మొత్తం పురోగతికి కృషి చేయడం ఎల్లప్పుడూ తన ఎజెండాలో ఉంటుందని ఆడమ్స్‌ చెప్పారు. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న అత్యున్నత స్థాయి వైద్యులు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో తెలుగువారు ఎక్కువమంది ఉన్నారని అన్నారు. టిఎల్‌సిఎ నుండి ఏవైనా అభ్యర్థనలు పంపిస్తే దానికి తన కార్యాలయం నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉయ్‌ లవ్‌ న్యూ యార్క్‌ సిటీ అని రాసి ఉన్న ప్లకార్డ్‌ పట్టుకొని ప్రసంగించడం ఆకర్షించింది.

మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌  మాట్లాడుతూ డైవర్సిటీ ఈస్‌ ది హాల్మార్క్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ సిటీ అంటూ భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని గుర్తు చేశారు.

డిప్యూటీ కమీషనర్‌ దిలీప్‌ చౌహాన్‌, దశాబ్దాలుగా న్యూయార్క్‌ నగరం, లాంగ్‌ ఐలాండ్‌లోని తెలుగు సంఘంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌కి తమ ఆహ్వానాన్ని మన్నించి తమ కార్యక్రమానికి విచ్చేసినందుకు టి.ఎల్‌.సి.ఎ అధ్యక్షులు నెహ్రూ కఠారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

చివరన టాలీవుడ్‌ గాయనీ గాయకులు సత్య యామిని, అనుదీప్‌ తమ ఎనర్జిటిక్‌ పాటలతో ఆహూతులందరినీ ఉర్రూతలూగించారు. పిల్లలు, పెద్దలు సైతం వేదికపైకి వెళ్లి డాన్స్‌ చేయడం విశేషం. ఈ సందర్భంగా టి.ఎల్‌.సి.ఎ కార్యవర్గం సత్య యామిని మరియు అనుదీప్‌లను గౌరవంగా సన్మానించింది.  

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :