రివ్యూ : స్టువర్ట్ పురం దొంగ కథ "టైగర్ నాగేశ్వరరావు"

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, నిడివి: 182 నిమిషాలు
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిష్షు సేన్ గుప్తా, మురళీ శర్మ, గాయత్రి భరద్వాజ్, నాజర్, తదితరులు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : ఆర్ మదీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
మాటలు : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
నిర్మాత: అభిషేక్ అగర్వాల్, రచన, దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ : 20.10.2023
ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేసేందుకు ముందుండే రవితేజ ఈ సారి స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు అంటూ మాస్ మహారాజా మరో ప్రయోగం చేశాడు. దర్శకుడు వంశీ సైతం ముందు నుంచి చాలా నమ్మకంతో ఉన్నాడు. టీజర్, ట్రైలర్‌లు సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. మరి దసరా సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఓ సమీక్షలో చూద్దాం.
కథ:
స్టువర్ట్ పురం ప్రాంతాన్ని ఎలమంద (హరీష్ పేరడీ) ఏలుతుంటాడు. ఆ ప్రాంతంలో ఏ దొంగతనం జరిగినా, చేసినా ఎలమందకు కమిషన్ వెళ్లాల్సిందే. అలాంటి ప్రాంతంలో నాగేశ్వరరావు బాల్యంనుండే దొంగతనాలు మొదలెట్టి క్రమక్రమంగా ఎదుగుతుంటాడు. నాగేశ్వరరావు నుంచి స్టువర్ట్ పురం నాగేశ్వరరావుగా.. అక్కడి నుంచి టైగర్ నాగేశ్వరరావుగా ఎదురులేని దొంగగా మారుతాడు. అలాంటి టైగర్ నాగేశ్వరరావు ఏకంగా ప్రధాన మంత్రి ఆఫీస్‌లోనే దొంగతనం చేస్తానని హెచ్చరిస్తాడు. దొంగతనాలకు పాల్పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మర్వాడి అమ్మాయి (నూపుర్ సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే తన జీవితంలో ఎన్నో దొంగతనాలు చేసిన ఆయన ఏకంగా ప్రధానమంత్రి ఇంటిలో దోపిడికి ప్లాన్ చేసి సెక్యూరిటీకి చెమటలు పట్టిస్తాడు. ఆ క్రమంలో నాగేశ్వరరావు మరదలు (గాయత్రి భరద్వాజ్) ఆయన జీవితంలోకి వస్తుంది. ఆ తరువాత పీఎం సెక్యూరిటీని పర్యవేక్షించే ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా (అనుపమ్ ఖేర్) ఏం చేశాడు? నాగేశ్వరరావు బాల్యంలోనే ఎందుకు దొంగగా మారాడు? 8 ఏళ్ల వయసులో దొంగగా మారి తన తండ్రినే ఎందుకు చెప్పాడు? కరువు బాధితులకు ఆహారం తీసుకెళ్లే ట్రైన్‌పై నాగేశ్వరరావు టీమ్ ఎందుకు దోపిడి ప్లాన్ చేసింది.
నాగేశ్వరరావు ఆంధ్రాలో దొంగతనాలకు పాల్పడుతూ తమిళనాడు పోలీసులకు ఎలా చిక్కాడు? ప్రధాన మంత్రి ఇంటిలో దొంగతనం చేయాలనే విషయం వెనుక అసలు కారణం ఏమిటి? ప్రధాన మంత్రి ఇంటిలో నుంచి నాగేశ్వరరావు ఏం దొంగతనం చేశాడు? ప్రధాని ఇంటిలో దొంగతనం చేసిన తర్వాత నాగేశ్వరరావు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? టైగర్ జీవితంపై హేమలత లవణం (రేణుదేశాయ్) ప్రభావం ఎలా ఉంది? మరదలిని పెళ్లి చేసుకొన్న తర్వాత నాగేశ్వరరావుకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? చివరకు నాగేశ్వరరావు జీవితానికి ముగింపు ఏమిటి? అసలు నాగేశ్వరరావు జీవిత లక్ష్యం ఏమిటి? అనేదే మిగతా కథ.
నటీనటుల హావభావాలు:
నటి నటుల గురించి చెప్పాల్సివస్తే... రవితేజ యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా మారిన పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో తన మార్కు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. అయితే డైలాగ్ డెలివరీ విషయంలో డబ్బింగ్ పరంగా ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక నూపుర్ సనన్ తన పాత్ర పరిధి తగినట్టుగా ఫెర్ఫార్మ్ చేసింది. గాయత్రి భరద్వాజ్ తన పాత్ర ద్వారా క్లైమాక్స్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్ ద్వారా ఎమోషనల్‌గా మార్చింది. హరీష్ పేరడి, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ఇతరుల తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు:
మంచి కథను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు వంశీ. కానీ, ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడు. ఆర్. మధి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ఉండే ఈ కథకు ఫీల్ కలిగించడానికి ఉపయోగించిన కలర్ టోన్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. జీవీ ప్రకాశ్ కొన్నిసార్లు అవసరం లేకున్నా కొన్నీ సీన్లలో సౌండ్ పెల్యూషన్‌కు కారణమయ్యాడనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలా పని ఉందనిపించింది. నిడివి కొంత తగ్గించి ఉంటే ఇంకా బెటర్ ఫీల్ ఉండే అవకాశం ఉండేది. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రిచ్ నెస్ తెర మీద కనిపించింది.
విశ్లేషణ:
టైగర్ నాగేశ్వరరావు కథను ప్రథమార్దం చూస్తే రవితేజను చాలా క్రూరంగా, నాగేశ్వరరావు ఎంత రాక్షసుడో అన్నట్టుగా చూపించాడు. చిన్నతనంలోనే తండ్రి తలను నరికిన క్రూరుడిగా చూపించారు. ఆడది కనిపిస్తే ఆకలి అంటూ ఆకతాయిలా ప్రవర్తిస్తాడన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. దొంగతనాలే లక్ష్యంగా జీవితాన్ని సాగిస్తాడన్నట్టుగా కథనం సాగుతుంది. అయితే టైగర్ చేసే ప్రతీ పని వెనుక ఓ మంచి, ఓ ఊరి ప్రయోజనం ఉందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇస్తారు. అప్పటి వరకు మనం చూసిన సినిమా అంతా ఒకలా కనిపిస్తే.. ఆ తరువాత ఇంకోలా కనిపిస్తుంది. రామాయణంలో రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు అదే లంకలో వెళ్లి చూస్తే రావణుడిలోనూ రాముడు కనిపిస్తాడు అన్నదే ముఖ్యమైన పాయింట్. సినిమా ఓవరాల్‌గా ఎమోషనల్ పాయింట్‌తో, హై ఎనర్జీతో ముగించడం వల్ల అప్పటి వరకు ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి దోహదపడింది. దసరా రేసులో హిట్ రేసులో ఈ సినిమా ఉంటుందా? అనేది రెండు, మూడు రోజుల్లో స్పష్టమవుతుంది.






