ASBL Koncept Ambience
facebook whatsapp X

పాలిటిక్స్ లోకి ఇళయదళపతి?

పాలిటిక్స్ లోకి ఇళయదళపతి?

తమిళ నటుడు ఇళయదళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడా? ఇప్పటికే.. మెస్సేజ్ ఓరియెంటేడ్ సినిమాలతో ఆ దిశగా మార్గం సిద్ధం చేసుకుంటున్నాడని బయట టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. కాగా.. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఆ వార్తలకు పూర్తిగా బలాన్ని చేకూరుసున్నాయి. అయితే.. తమిళనాడులోని చెన్నైలో విజయ్ అభిమాన సంఘం అయిన మక్కల్‌ ఇయక్కం సంస్థ.. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో ఇంటర్, టెన్త్‌ క్లాస్‌ టాపర్లను సన్మానించే కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి విజయ్ ప్రసంగం  వైరల్‌గా మారింది.

భవిష్యత్తు ఓటర్లు మీరే... భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవాల్సింది కూడా మీరే" అంటూ విద్యార్థుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న రోజుల్లో వ్యవస్థ చాలా కమర్షియల్‌గా మారిపోయిందని.. డబ్బు ఇచ్చినవాళ్లకే కొంత మంది ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ఓటును ఒక నాయకుడు డబ్బు ఇచ్చి కొంటున్నాడంటే.. అతను అక్రమంగా ఎంత డబ్బు సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోవాలని వివరించాడు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయొద్దని తమ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలని విద్యార్థులకు సూచించారు.

మరోవైపు.. ప్రస్తుత కాలంలో సోషల్‌మీడియా వేదికగా కొంత మంది పనిగట్టుకుని మరీ ఎన్నో ఫేక్‌న్యూస్‌లు సృష్టిస్తుంటారని విజయ్ చెప్పుకొచ్చారు. వాటి వెనుక కొన్ని అజెండాలు ఉంటాయని.. వాటిని అర్థం చేసుకునేందుకు డా. బీఆర్ అంబేడ్కర్‌, పెరియార్‌ వంటి గొప్ప గొప్ప నాయకులు రాసిన పుస్తకాలు చదవాలని పిల్లలకు విజయ్ సూచించారు. ఇదే క్రమంలో.. ధనుష్ నటించిన అసురన్‌ సినిమాలోని డైలాగ్‌ను విజయ్ చెప్పాడు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బుంటే లాగేసుకుంటారు.. కానీ చదువును మాత్రం మనదగ్గరి నుంచి ఎవ్వరూ తీసుకొలేరన్నారు..

ఈ కార్యక్రమంలో విజయ్ చేసిన పొలిటికల్ కామెంట్స్.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనంటూ.. చర్చకు తెరలేచింది. ఇటీవలికాలంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నాడు. దీంతో.. 2026లో తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. విజయ్ ఇలా ప్రజల్లోకి వస్తున్నారని.. ప్రచారం మొదలైంది.

గతంలో తన మక్కల్ ఇయక్కం సంస్థతో రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక అంశాలపై సర్వే కూడా చేపించారు. అంతే కాకుండా.. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నిరసనను తనదైన శైలిలో వ్యక్తపరిచి వార్తల్లో నిలిచారు. ఆసమయంలో విజయ్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :