ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణలో నూతన ఇసుక పాలసీ..

తెలంగాణలో నూతన ఇసుక పాలసీ..

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతన ఇసుకపాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్తపాలసీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతి దందాగా మారిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని హెచ్చరించారు తెలంగాణ సీఎం. ఇసుక రీచ్‌లు, డంప్‌లు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్‌లైన్‌ విధించారు. రెండు రోజుల్లోగా తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను సైతం రంగంలోకి దింపుతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సూచించారు. అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పుడున్న ఇసుక రీచ్ లు, డంప్ లన్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఇసుక రీచ్ లన్నింటా సీసీ కెమెరాలున్నాయని అధికారులు ఇచ్చిన సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాదయాత్రకు వెళ్లినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసి.. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈనెల 3వ తేదీన రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అనుమతి లేదని గుర్తించారు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్ తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందని అన్నారు సీఎం రేవంత్. ఈ లెక్కన 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతుందని సీఎం అంచనాగా చెప్పారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని అన్నారు సీఎం రేవంత్.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :