రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. బడ్జెట్ కేటాయింపులు ఇలా
తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకూంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప, అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకులు నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని తెలిపారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా....
ఆరు గ్యారెంటీల కోసం అత్యధికంగా రూ.53,196 కోట్లు కేటాయించింది. ఐటీ శాఖకు రూ.774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1,250 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.8వేల కోట్లు కేటాయించింది. రూ. 2 లక్షల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు.