ASBL NSL Infratech

ప్రతీకార రాజకీయంతో టీడీపీకి చేటే..!?

ప్రతీకార రాజకీయంతో టీడీపీకి చేటే..!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని విజయం సాధించింది. జనసేన, బీజేపీతో కలిసి చరిత్ర సృష్టించింది. దీంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వీధుల్లోకి వచ్చి హంగామా చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వైసీపీ నేతలపై నోరుజారడాలు, వాళ్ల ఇళ్లపై దాడులు చేయడాలు ఏమాత్రం హర్షించదగనివిగా ఉన్నాయి. ఇలాంటి చర్యలు టీడీపీకి ఏమాత్రం మేలు చేయవనే టాక్ వినిపిస్తోంది.

2019 నుంచి 2024 వరకూ వైసీపీ అధికారంలో ఉంది. తాము ఎంతో సంక్షేమం, అభివృద్ధి చేసినా ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారని బాధపడుతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కానీ వైసీపీ ఎలాంటి తప్పులు చేసిందో ప్రజలకు తెలుసు. కక్షపూరిత రాజకీయాలు, అవమానాలు, బెదిరింపులు, కేసులు, కూలగొట్టడాలు.. లాంటివాటి వల్లే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. సంక్షేమం ఎంత చేస్తున్నా ఇలాంటివాటిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు.

అయితే వైసీపీని దారుణంగా ఓడించి తమకు పట్టం కట్టారు కాబట్టి ప్రజలు తమవైపే ఉన్నారనే భ్రమల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్టు అర్థమవుతోంది. వైసీపీ తప్పులను టీడీపీ సరిదిద్దుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని, కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్తుందని భావించి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ టీడీపీ ప్రజాతీర్పును ఇలా అర్థం చేసుకోవట్లేదు. తామేం చేసినా ప్రజలు హర్షిస్తారని.. అందుకే తమను గెలిపించారని భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ అరాచకాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించామని.. అయినా ప్రజలు ఆమోదించారు కాబట్టి వాళ్లకు కౌంటర్ తప్పక ఇస్తామనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. పలువురు నేతల ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. వైసీపీ నేతలు, సానుభూతిపరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఏదైనా సందర్భంలో ఆవేశంలో ఇలాంటి పనులు చేయొచ్చు. కానీ పనిగట్టుకుని ఇలా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే మాత్రం ప్రజలు ఏమాత్రం హర్షించరు. ఇలాంటి పనులు చేసినందుకే వైసీపీని ఇంటికి సాగనంపారు. టీడీపీ కూడా ఇప్పుడు ఇలాంటి పనులే చేస్తే రేపు వైసీపీకి పట్టిన గతే తెలుగుదేశానికి కూడా పట్టడం ఖాయం. ఆ విషయం గ్రహించి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :