ASBL NSL Infratech

కేంద్రకేబినెట్ లో ఏపీ బెర్తులు..

కేంద్రకేబినెట్ లో ఏపీ బెర్తులు..

కేంద్ర కేబినెట్ లో ఏపీకి రెండు బెర్తులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ.. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెదేపాకు మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

విధేయత, అనుభవం..కేరాఫ్ రామ్మోహన్ నాయుడు

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర క్యాబినెట్‌ బెర్తు ఖరారు చేశారు.

పెమ్మసానికి తొలిసారే అదృష్టం

ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది.

అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్‌ ఎంపికలో తొలుత 10 స్థానాల కంటే ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో టీడీపీకి తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :