సీట్ల పంపిణీలు.. అడకత్తెరలో పోక చెక్క అయిన బాబు పరిస్థితి..
ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో రోజుకు ఒక కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా టిడిపి, జనసేన పార్టీల పొత్తు కింద సీట్ల సర్దుబాటు విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా బీజేపీ విషయంలో క్లారిటీ లేదు కాబట్టి కాలికంగా ఆ పార్టీని పక్కకు పెట్టి జనసేన తన లెక్కలు సెటిల్ చేసుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉండే ఉండాలి అనేది జనసైనికుల ఆశ. మరోపక్క కొన్ని జిల్లాలలో మెజారిటీ సీట్లు కూడా అడుగుతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది.
మరి ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు జిల్లాలో కూడా జనసేన తమకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిందిగా కోరుకుంటుంది. ఇటు కృష్ణాలో కూడా తగ్గేదే లేదు అన్నట్టు నాలుగు సీట్లు అడుగుతున్నట్లు టాక్. విజయవాడ పశ్చిమ, కైకలూరు, అవనిగడ్డతోపాటు పెడనలో కూడా సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తోంది జనసేన. దీనికి ముఖ్య కారణం ఆ నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడం. ఈ కారణం చేత తమకు ఆ నియోజకవర్గాలలో గెలుపు కచ్చితంగా జనసేన ఆ సీట్ల నుంచే పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పెడన సీటును ఎంపీ బాలసౌరి కొడుకు కోసం జనసేన పార్టీ కోరుకుంటుంది.
అయితే మరోపక్క ఈ సీటు కోసం మాజీ మంత్రి కాగితి వెంకట్రావు కుమారుడు.. కాగిత కృష్ణ ప్రసాద్ ఎదురు చూస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పటికే అతను ప్రచారం కూడా మొదలుపెట్టేసాడు.అవనిగడ్డ నియోజకవర్గంలో.. మాజీ డిప్యూటీ స్పీకర్.. ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జ్.. మండలి బుద్ధ ప్రసాద్.. టిడిపి తరఫునుంచి ఈసారి సీటు ఆశిస్తున్నాడు. అయితే జనసేన తరఫున విక్కుర్తి శ్రీనివాస్ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. మరోపక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ తప్పకుండా ఈ సీటు జనసేనకే వస్తుంది అని ఆశిస్తున్నాడు.
మరోవైపు టిడిపి నుంచి ఏకంగా జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్ధ వెంకన్నలు టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు కైకలూరు పై కూడా జనసేన కన్ను ఉంది. అయితే ఎంతోకాలంగా టిడిపిని నమ్ముకొని పార్టీ కోసం పని చేస్తున్న నేతలు ఈ స్థానాల నుంచి సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలో నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. నిజం చెప్పాలంటే కరవమంటే కప్పక కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు మారింది బాబు పరిస్థితి. ఈ నేపథ్యంలో బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.