టాసా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముహూర్తం ఫిక్స్
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో తెలుగు సంఘం (టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 21వ తేదీ ఆదివారం నాడు శాన్ ఆంటోనియోలోని ష్రైన్ ఆడిటోరియం వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సంబరాల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ వెంటనే రాత్రి భోజనం ఉంటుంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య స్నాక్స్ అందజేస్తారు. ఈ సంబరాల్లో భాగంగా తెలుగు సంప్రదాయ కుటుంబ వస్త్రధారణ పోటీలు, ముగ్గుల పోటీలు, పులిహోర పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంబరాల్లో పాల్గొనాలని అనుకునే వారు పెద్దవారైతే 20 డాలర్ల టికెట్ తీసుకోవాలి. అదే 6-13 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలైతే 15 డాలర్ల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరేళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులు ఉచితంగానే ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు.