ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 181వ నెలనెలా తెలుగు వెన్నెల

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 181వ నెలనెలా తెలుగు వెన్నెల

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 181 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు.

చిరంజీవి భవ్య తన లేలేత మధుర గాత్రంతో ఆలపించిన ''గోవింద గోవింద యని కొలువరే..... గోవిందా యని కొలువరే'' అన్నమాచార్య కీర్తన సాహిత్య ప్రియులను భక్తి పారవశ్యంలో తెలియాడేలా చేసింది. ఆధునిక పదబంధ ప్రహేళికా చక్రవర్తి శ్రీ ఊరిమిండి నరసింహారెడ్డి గారు తన సాహిత్యయజ్ఞంలో అందరినీ భాగస్వాములను చేయాలనే సత్సంకల్పంతో 2018 నుండి నేటివరకు ప్రతినెలా నిర్వహిస్తున్న"మన తెలుగు సిరిసంపదలు" కార్యక్రమములో ప్రహేళికలు, అంతర్లాపిక ప్రహేళికలు జానపద సాహిత్య మిళితమైన పొడుపు కథలు చమత్కార పద్యాలు వాటిలో పూరణ చేయవలసిన పదాలను ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను తీవ్రముగా ఆలోచింపచేసి వారినుండి సరియైన   సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఈనెలలో కూడా ఒక వినూత్న ప్రయోగంతో ప్రపంచవ్యాప్త సాహితీ ప్రియుల మెదడుకు మేత వేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి అందరి  ప్రశంసలనందుకున్నారు.

ప్రతి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట గారు, రాధ కాశీనాధుని గారు కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. డాక్టర్ ఉపద్రష్ట సత్యం గారు నేటి పద్య సౌగంధం కార్యక్రమములో ఆధునిక వాంగ్మయకవి పుంగవులు ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతక /మహాత్యములోని అత్యంత భక్తిరస పద్యమును చదివి సందర్భ సహిత వ్యాఖ్యతో సహా భావార్ధాలను సులభరీతిలో వివరించి జీవన్ముక్తికి భక్తితో సాధనచేయుట ఒక్కటే మార్గమని ఉద్బోధించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 181వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ తాళ్లూరి ఆంజనేయులు గారు ''ప్రాచీన తెలుగు సాహిత్యంలో నన్నయ పాత్ర'' అంశంపై అద్భుతమైన ప్రసంగము చేశారు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారనీ, వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించినవారేననీ తెలిపారు వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదశ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదనీ, ’భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం’ అన్నాడనీ, దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడని తెలిపారు . తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారనీ, అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది అని చాలా స్పష్టంగా చెప్పారు.

నన్నయ తన ముగింపు పద్యములో ''శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి” అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు. “వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు'' అని నన్నయ వర్ణించిన విధానాన్ని చాలా విపులంగా వివరించారు శ్రీ ఆంజనేయలుగారు. ఆది కవి నన్నయచేసిన ఆయా వర్ణనలను వివరిస్తూ అమృతతుల్యమైన తన ప్రసంగానికి ముగింపు వాక్యాలు పలకడంతో నేటి ముఖ్య అతిధి చల్లని వెన్నెలను శీతల వాయుసహితహిమాన్ని తనతో పాటు తెచ్చి మనపై కురిపించినట్లుగా భావిస్తున్నామని పలువురు సాహితీ ప్రియులు డాక్టర్ తాళ్లూరి ఆంజనేయలు గారిని అభినంచారు.

నేటి ''మాసానికో మహ నీయుడు'' శీర్షిక క్రింద ఆగస్టు నెలలో జయంతి మరియు వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖ  కవుల సాహితీ వేత్తల వివరాల్ని అధిక శ్రమకోర్చి సేకరించి ఆయా రచయితలను గుర్తుచేయడమే గాక ''మాతెలుగు తల్లికి మల్లె పూదండ మాకన్న తల్లికి మంగళారతులు'' వంటి అద్భుతమైన పాటకు మూలాధారముగా చెప్పబడుతున్న పద్యమును తేటగీతిలో రచించిన ప్రముఖ కవి శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి జీవిత విశేషాల్ని వారు వ్రాసిన రచనల్ని సవివరముగా వివరించిన డా.అరుణ జ్యోతిరెడ్డి కోలాగారి కృషి ప్రసంశనీయం. ప్రసిద్ధ కవి  శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదు గారు ఈ కార్యక్రమానికి హాజరై ప్రస్తుతం అన్ని వర్గాలవారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను అధిగమించడాన్నికి ధ్యానమొక్కటే మార్గమని చెప్తూ ధ్యానము ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవడానికి మార్గదర్శకులైన విశ్వ స్ఫూర్తి గురువరేణ్యులు గురించీ వారు వ్రాసిన ''ధ్యాన మనో ప్రస్థానం'', ''ప్రస్థాన సాధన'' వంటి ధ్యాన సంబంధ పుస్తకాలములను చదవవలసిన ఆవశ్యకత గురించీ విపులంగా వివరించారు.

సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు నేటి సభను విజయవంతము చేసిన ప్రముఖ సాహితీ వేత్తలందరికీ కృతజ్ఞతలు తెలపడమే గాక శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదు గారు వెల్లడించిన ధ్యానసంబంధ సూచనలు ఆచరణ సాధ్యమేనని సర్వదా అందరికీ ఆమోదయోగ్యమేనని అన్నారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన గారు ముఖ్య అతిథి డాక్టర్ తాళ్లూరి ఆంజనేయులు గారికి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన చిరంజీవి భవ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :