ASBL NSL Infratech

న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో మెరిసిన తానా ‘బంగారు బతుకమ్మ’

న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో మెరిసిన తానా ‘బంగారు బతుకమ్మ’

ఆకట్టుకున్న మహిళల ఆటపాటలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీనటి అనసూయ, గాయని మంగ్లీ
తానా ప్రముఖుల హాజరు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వ తేదీన నిర్వహించిన బంగారు బతుకమ్మ పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌లో 20 అడుగుల ఎత్తున తీర్చిదిద్దిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆహుతులను, విదేశీయులను ఎంతగానో ఆకర్షించింది. తెలంగాణా సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ అలంకరణ, పాటలు, ఆటలు  విశ్వవేదిక అయిన టైమ్‌ స్క్వేర్‌లో పండగ కాంతులు పంచాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ లతో పాటు అమెరికా లోని వివిధ రాష్ట్రాలనుంచి వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. స్వయంగా తాము తయారు చేసిన బతుకమ్మలతో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రకరకాలపూలతో సర్వాంగసుందరమైన బతుకమ్మ అలంకరణ అందర్నీ విశేషంగా ఆకర్షించింది.

తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్‌ తాళ్ళూరి, తానా కల్చరల్‌ కో ఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ బోర్డ్‌ డైరెక్టర్‌ లక్ష్మి దేవినేని, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, వెంకట్‌ చింతలపల్లి, దీపిక సమ్మెట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆకట్టుకునేలా సాగాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు సాగిన ఈ వేడుకలలో పాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, ఈ పండగను విశ్వవేదిక మీద జరుపుకోవడం గర్వంగా ఉందని, సమష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను తానా ద్వారా నిర్వహించి మన తెలుగుజాతి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఈవేడుకలో తెలుగువారందరిని సమన్వయ పరిచి, ఇత పెద్ద ఎత్తున ఈ వేడుకను నిర్వహించి విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్‌ కో ఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడారు. అలాగే ఈ భారీ కార్యక్రమానికి సహకరించిన ఆడపడుచులందరికీ, అలాగే కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన వలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్‌ తాళ్లూరి మాట్లాడుతూ మన సంప్రదాయంలో దేవుళ్ళని పూలతో పూజించే మనం, ఈ పండగకి మాత్రం పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలో ఉన్న విశిష్టతను తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నిరంజన్‌ శృంగవరపు మాట్లాడుతూ తానా ఎల్లప్పుడూ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుందన్న మాటని రుజువు చేసుకుంటూ సంస్థ ప్రతిష్టని మరింత పెంచే విధంగా బంగారు బతుకమ్మ ఉత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.  కనులవిందుగా అలంకరిచిన బతుకమ్మ టైమ్‌ స్క్వేర్‌ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇంతటి మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్‌ నగరంలో చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనకు భారత దేశ సంప్రదాయాలను, పండుగల గురించి  తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానా సంస్థకు ఆయన అభినందనలు తెలియజేసారు. అలాగే భారతీయ సంసృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో  తానా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రూక్లీన్‌ బరో ప్రెసిడెంట్‌ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియావ్యవహారాల డైరెక్టర్‌ దిలీప్‌ చౌహాన్‌ తానా సంస్థకు మేయర్‌ ద్వారా జారీ చేసిన అభినందన పత్రాన్ని అందించారు.

ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రఖ్యాత టీవీ, సినీనటి అనసూయ, ప్రముఖ జానపదగాయని మంగ్లీ తమ ఆటపాటలతో హోరెత్తించారు. అలాగే మిమిక్రీ రమేష్‌ తమదైన హాస్యంతో ఆహుతులకు హాస్యాన్ని పంచారు.

ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టి పడేలా సంప్రదాయమైన అలంకరణలతో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అలాగే సంప్రదాయ నృత్యాలు, తారిక మహిషాసుర మర్ధిని నృత్య రూపకం హంసిని, అశోక్‌ చింతకుంట, మాధవి సోలేటి ఆధ్వర్యంలో చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించిన స్వాతి అట్లూరి విద్యార్థుల బృందం ఆహూతులని ఆనందింపజేశారు.

అమెరికాలోని వివిధ నగరాలనుంది తానా సంస్థ నాయకులు విచ్చేసారు.

ఈ కార్యక్రమానికి తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్‌ ట్రస్టీ విశ్వనాథ్‌ నాయునిపాటి, ఫౌండేషన్‌ ట్రస్టీలు సుమంత్‌ రామిశెట్టి-విద్య గారపాటి-శ్రీనివాస్‌ ఓరుగంటి, రవి సామినేని, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌- న్యూయార్క్‌ దిలీప్‌ ముసునూరు, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌- న్యూ ఇంగ్లాండ్‌ ప్రదీప్‌ గడ్డం, కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి, రవి మందలపు, రవి పొట్లూరి, రామ్‌ ఉప్పుటూరి, సునీల్‌ కోగంటి, వెంకట్‌ చింతలపల్లితోపాటు మాధురి ఏలూరి, పద్మజ బెవర తదితరులు పాల్గొన్నారు.

ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున  తానా కల్చరల్‌ కో ఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల, బోర్డ్‌ డైరెక్టర్‌ లక్ష్మి దేవినేని ధన్యవాదాలు తెలియజేశారు.


Click here for Event Gallery

https://drive.google.com/drive/folders/1J5wAaURHojB2GUH7uUaPc_q8GIky9jBU

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :