ప్రపంచంలోనే ఇదే తొలిసారి.. న్యూయార్క్ లో

అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటివి చేస్తున్నా న్యూయార్క్‌లోని వైద్యులు మాత్రం అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చి వేసి రికార్డు సృష్టించారు. ఇలాంటిది ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్నారు. అయితే ఆ కన్నుద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది. అధిక వోల్టేజీ ఉన్న విద్యుత్తు తీగలు తగిలిన కారణంగా ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి ముఖం చాలావరకు కాలిపోగా ఒక కన్ను మొత్తం పోయింది. కుడి కంటిని రెప్పతో సహా సమూలంగా మారిస్తే ఆయన ముఖానికి కొత్తరూపు ఇచ్చినట్లవుతుందని న్యూయార్క్ సిటీలోని లాంగోన్‌హెల్త్ ఆసుపత్రి వైద్యులు భావించారు. ఆ ప్రకారం మే నెలలో 21 గంటల సేపు చేసిన శస్త్రచికిత్స విజయవంతమై కొత్త కన్ను ఆరోగ్యంగా ఉందని వారు ప్రకటించారు. కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయినా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇది ఎన్నో నూతన మార్గాలకు ద్వారం తెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.






