MKOne Telugu Times Youtube Channel

భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడికి కల్యాణాన్ని భక్తజనం కనులారా వీక్షించి పులకించింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనసందోహం మధ్య త్రిదండి చినజీయస్వామి  సమక్షంలో అర్చకులు కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తుల రామనామస్మరణ మధ్య జానకమ్మను జగదభిరాముడు మనువాడారు.  ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధానాలయంలో  మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు.

ఆ తర్వాత కల్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కన్యావరుణ పూజలు నిర్వహించారు. సీతారాముల వారి గోత్రనామాలను పఠిస్తూ ప్రవర క్రతువును కొనసాగించారు. సీతమ్మవారికి యోక్షధారణ చేశారు.  రామువారికి యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. అభిజిత్‌ లగ్నం సమీపించడంతో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల వారి శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి మంత్రోచ్చరణ చేశారు. కల్యాణ పరమార్థాన్ని వివరిస్తూ చూర్ణిక అనే వేడుక నిర్వహించారు. అనంతరం మాంగల్యధారణ అంగరంగ వైభవంగా జరిగింది.

 

 

Tags :