ASBL NSL Infratech

భారీ సినిమాలు టాలీవుడ్ కు వరమా? కష్టమా ?

భారీ సినిమాలు టాలీవుడ్ కు వరమా? కష్టమా ?

టాలీవుడ్‌లో గతంలో కన్నా ఇప్పుడు భారీ సినిమాలు, భారీ హీరోలు, భారీ పారితోషికాలు, భారీ సెట్టింగ్‌లతో చూడటానికి అదిరిపోయేలా ‘షో’ కనిపిస్తున్నా...ఆ పెద్ద చిత్రాల విడుదల తేదీల్లో జరుగుతున్న గందరగోళం, ఇతర సినిమాలకు, ముఖ్యంగా చిన్న చిత్రాలకు, డబ్బింగ్‌ చిత్రాలకు కష్టాలను తెచ్చి పెడుతోంది. వారు తమ సినిమాలను ఎప్పుడు రిలీజ్‌ చేయాలో తెలియని పరిస్థితిలో ఏదో ఒక సమయంలో రిలీజ్‌ చేసుకుంటున్నారు. మరోవైపు భారీ సినిమా నిర్మాణం నుంచే ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న ఆ చిత్రాలు ఎలాగోలా రిలీజ్‌ చేస్తే, తరువాత ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నిర్మాతలు తాము ఇన్నాళ్ళు పడిన వాయిదా కష్టాలతోపాటు, నష్టాలను కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

హాలీవుడ్‌ నుంచి తెచ్చుకున్న ఈ సంస్కృతి టాలీవుడ్‌కు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. హాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌ అప్పుడే రిలీజ్‌ డేట్‌ లను కూడా ప్రకటించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని టాలీవుడ్‌ కూడా దిగుమతి చేసుకుంది.. కాని అనుకున్న సమయానికి అన్నీ పూర్తి కాక ఇబ్బందుల్లో పడి రిలీజ్‌ తేదీలను మారుస్తూ వచ్చి అందరినీ గందరగోళంలో పడేస్తోంది.

అనేక కారణాల వల్ల సినిమా తీసిన తర్వాత కూడా విడుదల కావడానికి జాప్యం అవుతుంది.  సినిమా విడుదల తేదీలను ఏడాది లేదా రెండు సంవత్సరాల ముందుగానే బుక్‌ చేసుకొంటున్నారు.  మొదట, చిత్రీకరణ తర్వాత, ఎడిటింగ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ జోడిరచడం, సౌండ్‌ డిజైన్‌ మరియు స్కోరింగ్‌ వంటి పోస్ట్‌-ప్రొడక్షన్‌ ప్రక్రియ ఉంటుంది. ఇది పూర్తి కావడానికి చాలా నెలలు పట్టవచ్చు.  రెండవది, సినిమా విడుదల తేదీలలో ఒక వ్యూహాత్మక అంశం ఉంది. ఇతర చలనచిత్రాలు, సెలవులు మరియు ఇతర అంశాల నుండి పోటీని పరిగణనలోకి తీసుకుని, దాని విజయావకాశాలను పెంచుకోవడానికి నిర్మాతలు తరచుగా చలనచిత్ర విడుదలను ప్లాన్‌ చేస్తారు. చివరగా, మార్కెటింగ్‌ మరియు పంపిణీ దశ ఉంది, ఆ తరువాత  ఇక్కడ సినిమా ప్రచారం చేయబడుతుంది.  థియేటర్లు లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు పంపిణీ చేయబడుతుంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఆ  తర్వాత సినిమా  విడుదల తేదీని ప్రకటిస్తారు. ఎక్కువ మంది (ముఖ్యంగా యూత్‌) సినిమా చూడటానికి సమయం  కేటాయిస్తారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని, పరీక్షలు, సెలవులు చూసి మరీ విడుదల తేదీని ప్రకటిస్తారు నిర్మాతలు. భారీ బడ్జెట్‌తో పెద్ద హీరోల  కొన్ని చిత్రాలు ఎక్కువగా వేసవిలో విడుదల అవుతుం టాయి. కొన్ని సినిమాలు  శీతా కాలపు విడుదల కోసం లక్ష్యం గా పెట్టుకోవచ్చు.

ఇక పండగ సినిమాలంటే ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ తరువాత దసరా దీపావళి సినిమాలు. ప్రత్యేకించి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో ఒకే ప్రేక్షకులతో పోటీ పడేందుకు ఒకే తేదీలో ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు  విడుదల కావు.  సినిమా షూటింగ్‌ 60 రోజులు మాత్రమే పడుతుంది, కొంత మంది నిర్మాతలు  అదే రోజు విడుదల తేదీ కూడా ప్రకటి స్తారు  కానీ థియేటర్లలోకి రావడానికి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది? స్క్రిప్ట్‌ రాయడం, పిచ్‌ చేయడం, ఇవన్నీ.... టీంను సమీకరించాల్సిన అవసరం ఉంది. దర్శకుడు తనకు ఏమి కావాలో ఆలోచిస్తాడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు  క్యారెక్టర్‌ ఆర్టిస్టులు మొదలగునవి. ప్రతిదీ షెడ్యూల్‌ చేయబడుతుంది. సినిమాలో పెద్ద నటీనటులు ఉన్నట్లయితే వారి మిగిలిన షెడ్యూల్‌లను అతివ్యాప్తి చేయకుండా ఉండే మార్గాన్ని గుర్తించాలి. ఇలాంటప్పుడే అసలు షూటింగ్‌ మొదలవుతుంది. ఇక ముఖ్య విషయానికొస్తే...

సినిమా విడుదల తేదీ ప్రకటించాలంటే  ఎంత సమయం ముందు నిర్మాణాన్ని పూర్తి చేయాలి?

ఇది బహుశా పూర్తిగా సినిమాపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, హాలీవుడ్‌ మూవీ  వండర్‌ వుమన్‌ చిత్రీకరణను నవంబర్‌ 2015 చివరలో ప్రారంభించి, మొదట్లో మే 2016లో డేట్‌ ప్రకటించారు. కానీ జూన్‌ 2017లో విడుదలైంది.  వండర్‌ వుమన్‌ వంటి హై ఎండ్‌ బడ్జెట్‌ మూవీతో వారు విడుదల తేదీకి ముందుగానే షూటింగ్‌ను పూర్తి చేస్తారు, ఎందుకంటే వారికి వీలైనంత త్వరగా రీషూట్‌లను ఎడిట్‌ చేయడానికి లేదా ప్లాన్‌ చేయడానికి చాలా సమయం కావాలి, అయితే స్వతంత్రంగా ఉండే విభిన్న సినిమాలు చాలా వరకు ఒక సంవత్సరం మాత్రమే పట్టవచ్చు. భారీ బడ్జెట్‌ సినిమాలతో అనుకున్న విడుదల తేదీ కంటే దాదాపు 3 నుండి 4 నెలల ముందు నిర్మాణాన్ని పూర్తి చేసి ఫస్ట్‌ కాపీ రాకుండానే విడుదల తేదీ ప్రకటించి, ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతారు. ‘‘పాత రోజుల్లో’’... సాధారణంగా ఎడిట్‌ని చాలా నెలల ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుంది, తద్వారా రి రికార్డింగ్‌, ఎఫెక్ట్స్‌, మిక్సింగ్‌ వంటివి చేసి ఫిల్మ్‌ పాజిటివ్‌ లో ప్రింట్‌ చేసి బాక్సుల్లో  థియేటర్‌లకు పంపేవారు. ఆ బాక్సులకోసం లాబుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది.  ప్రస్తుతం డిజిటల్‌ పంపిణీ లోకి  మారిపోయింది, నిర్మాత వ్యాపార లావాదేవీలు అన్ని సక్రమంగా జరిగితే చిటికెలో థియేటర్లలో బొమ్మ పడుతుంది.

కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితుల్లో.. సినిమానే ప్రేక్షకుడికి వద్దకు తీసుకెళ్లేందుకు ఓటీటీ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటికీ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే ఓటీటీల పరిధి ఎంత విస్తృతమైందో ఇట్టే అర్థమవుతోంది. అయితే, ఈ పరిణామమే థియేటర్ల పరిస్థితిని ప్రశార్థకంగా మార్చింది. ఆ మధ్య  షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్న తరుణంలో ఓటీటీల్లో త్వరగా సినిమాలను విడుదల చేయటమూ ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని పది వారాల నుండి  100 రోజులకు పెంచాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్‌కు రాలేకపోతున్నారా అంటే, అందుకు ఇంకా చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి.

బెంబేలెత్తిస్తున్న టికెట్‌ ధరలు.. సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలంటే మొదటగా గుర్తొచ్చేది టికెట్‌ ధర ఇటీవల విడుదల అయినా ‘సలార్‌’ సినిమాకు 450 రూపాయలుగా నిర్ణయించారు అంటే ఒక ఫామిలీ లో భార్య, భర్త పిల్లలిద్దరూ సినిమాకు వెళ్లాలంటే కనీసం 3 వేలు పర్సు ఖాళీయే. అందుచేత ఈనాటి ప్రేక్షకుడు సినిమా బాగుంది అన్న తరువాతే థియేటర్‌ లో చూస్తున్నాడు.   కరోనా తర్వాత సినిమా పరిశ్రమను ఆదుకునే చర్యల్లో భాగంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలోనైతే మొదటివారం 50శాతం అదనంగా వసూలు చేసేందుకు పచ్చజెండా ఊపాయి. వేసవికాలంలో విడుదలైన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌, బిగ్‌స్టార్స్‌ సినిమాలు కావడంతో ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపారు. అయితే, సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు అంతంతమాత్రమే. దీనికి ప్రధాన కారణం టికెట్‌ ధరలు. వీటికి పార్కింగ్‌ ఫీజు, క్యాంటీన్‌లో తినుబండారాల ధరలు అదనం. ఇవన్నీ సామాన్యుడిని థియేటర్‌కు రప్పించకుండా చేసే ప్రతిబంధకాలే. ఓటీటీల కన్నా ముందు వీటిపై ఓ నిర్ణయానికి వస్తే, ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించవచ్చన్నది సగటు సినీ అభిమాని సూచన.

ప్రొడక్షన్‌ కాస్ట్‌ తగ్గేనా?.. ఒకప్పుడు స్క్రిప్ట్‌ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్‌ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్‌ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్‌ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో-హీరోయిన్ల రెమ్యునరేషనూ ఓ కారణమే. అవసరం ఉన్నా లేకపోయినా విజువలైజేషన్‌ పేరుతో చేస్తున్న గ్రాఫిక్స్‌ నాసిరకంగా ఉండటమే కాకుండా, సినిమాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. వీపీఎఫ్‌ ఛార్జీల పరిస్థితి ఏంటి?.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లన్నీ డిజిటల్‌ స్క్రీన్‌లే. సర్వీస్‌ ప్రొవైడర్లైన క్యూబ్‌సినిమా, యూఎఫ్‌వో మూవీలు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు) వసూలు చేస్తున్నాయి. అయితే, కరోనా సమయంలో వీటికి మినహాయింపు ఇచ్చాయి. ఆ సమయంలో నెలకు దాదాపు రూ.12 నుంచి 15లక్షల నష్టం వచ్చినా థియేటర్లకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో భరించాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో వాటిని యథాతథంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు వారు ఉపయోగించే పరికరాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.17వేల వరకూ వీపీఎఫ్‌ ఛార్జీలు ఉన్నాయి. వీటి ధరలను కూడా స్థిరీకరిస్తే బాగుంటుందని నిర్మాతల మండలి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

గత ఏడాదే విడుదల కావలసిన కొన్ని సినిమాలు గత ఏడాది పలుమార్లు షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తుండడంతో ఈ ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ లో పాన్‌ ఇండియా స్టార్స్‌ గా డార్లింగ్‌ ప్రభాస్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్‌ ప్రభాస్‌ కల్కి 2898ఏడీ మూవీ షూటింగ్‌ లో ఉన్నారు. అల్లు అర్జున్‌ పుష్ప 2 షూటింగ్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఈ మూడు సినిమాలకి సంబందించిన షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే జరుగుతూ ఉండటం విశేషం. ప్రభాస్‌ కల్కి 2898ఏడీకి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రత్యేకంగా వేసిన సెట్స్‌ లో షూట్‌ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్‌ కాన్సెప్ట్‌ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటంతో దానికి తగ్గట్టుగానే సెట్స్‌ డిజైన్‌ చేసి నైట్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ‘OG’ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్లు అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. మే లో పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్లో జాయిన్‌ అవుతారని ఇటీవల నిర్మాత దానయ్య చెప్పుకొచ్చారు. జూన్‌ నాటికి షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందట. ఆ వెంటనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ‘%ూG%’ కి పోటీగా రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ ని మూవీ టీం ప్లాన్‌ చేస్తోంది. ఇది ఒక విధంగా పవన్‌ కళ్యాణ్‌ ‘%ూG%’ సినిమాకే ఇబ్బందిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా పైనే కాదు అక్టోబర్‌ 10 ని రిలీజ్‌ కాబోతున్న ‘దేవర’ పై కూడా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎఫెక్ట్‌ ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే విషయంలో నిరంతరం గొడవలు పడుతూనే ఉన్నారు.

గేమ్‌ ఛేంజర్‌, దేవర రిలీజ్‌ తర్వాత ఇద్దరు హీరోల్లో ఎవరికి ఎక్కువ మార్కెట్‌ ఉందో తెలిసిపోతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తో  గ్లోబల్‌ స్టార్‌ గా మారిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆ తర్వాత ఆచార్యతో ఫ్యాన్స్‌ ని డిసప్పాయింట్‌ చేశాడు. దాంతో ఫాన్స్‌ ఆశలన్నీ ‘గేమ్‌ ఛేంజర్‌’ పైనే ఉన్నాయి. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. గత ఏడాదే విడుదల కావలసిన ఈ సినిమా పలుమార్లు షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తుండడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న  విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డైరెక్టర్‌ శంకర్‌ ఓ పక్క  ‘గేమ్‌ ఛేంజర్‌’ తో పాటు ‘ఇండియన్‌ 2’ ని ఒకేసారి షూట్‌ ప్లాన్‌ చేయడంతో గేమ్‌ ఛేంజర్‌ డిలే అవుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇక గేమ్‌ చేంజర్‌ లో యాక్షన్‌ ఘట్టాలని ప్రస్తుతం శంకర్‌ తెరకెక్కిస్తున్నారంట. ఈ షెడ్యూల్‌ తో రామ్‌ చరణ్‌ కి సంబందించిన మేగ్జిమమ్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోతుందని తెలుస్తుంది.

దీని తర్వాత ఒకటి, రెండు షెడ్యూల్స్‌ లో గేమ్‌ చేంజర్‌ మూవీ షూటింగ్‌ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఈ ఏడాది జూన్‌ కల్లా చిత్రీకరణ అంతా కంప్లీట్‌ అవుతుందని అంటున్నారు. మరోవైపు శంకర్‌ ఇండియన్‌ 2 మూవీ ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు గత కొద్దిరోజులుగా టాక్‌ వినిపించింది. అదే జరిగితే గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ మరింత ముందుకు అంటే  క్రిస్మస్‌ కి లేదా జనవరి 2025 కి షిఫ్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది.  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప 2 మూవీ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఫారెస్ట్‌ సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓ సాంగ్‌ కూడా షూట్‌ చేశారు. ఇప్పుడు కీలక సన్నివేశాలని సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు పాన్‌ ఇండియా స్టార్స్‌ ఒకే చోట షూటింగ్‌ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజ్‌ కావాల్సినవే కావడం విశేషం. కల్కి మూవీ మే 9న  ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పుష్ప 2 ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మూడు సినిమాలపైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

విడుదల తేదీ మార్పు వల్ల ఏ విధంగా నష్టం!

భారీ హీరోల చిత్రాలు విడుదల తేదీని అనుసరించి,  మధ్య, చిన్న తరహా సినిమాలు పెద్ద సినిమాలకు పోటీగా రాకుండా ఒక తేదీని ఫిక్స్‌ చేసుకుంటాయి. అయితే ఇటీవల  అకస్మాత్తుగా విడుదల తేదీని భారీ చిత్రాల నిర్మాతలు మార్చటం వలన చిన్న సినిమాల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటోంది. పెద్ద సినిమాలకు ఎదురుగా  విడుదల చేయలేరు. ఒకవేళ డేట్‌ చేంజ్‌ చేసుకుంటే నిర్మాతకు అదనంగా ఫైనాన్సర్‌  వడ్డీ పెరుగుతుంది. ఒక్కసారి తేదీ మార్చితే అప్పటి వరకు చేసిన పబ్లిసిటీ అంతా వృధా అవుతుంది. మరోసారి అనుకున్న థియేటర్లు దొరకవు ఏ రకంగా చూసుకున్నా చిన్న నిర్మాత నష్ట పోతాడు. భారీ చిత్రాలు విడుదల తేదీలు ఎన్ని సార్లు మార్చినా పెద్దగా తేడా రాదు. ఉదాహరణకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎన్ని సార్లు రిలీజ్‌ డేట్స్‌ మార్చారో తెలిసిందే!  ఇక ఈ ఏడాది విడుదల కాబోయే ముఖ్యమైన చిత్రాలు...  ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీలను  పరిశీలిస్తే...

*   మార్చ్‌ 2024.. 1న వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’,  8న గోపీ చంద్‌ ‘భీమా’, విశ్వక్‌ సేన్‌ ‘గామి,  29న డి జె టిల్లు 2.
*   05  ఏప్రిల్‌ 2024న  విజయ్‌ దేవరకొండ ‘ఫామిలీ స్టార్‌’.
*   09 మే, 2024న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2298 ఏడి’.
*   14 జూన్‌, 2024  రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ ‘డబుల్‌  ఇస్మార్ట్‌’.
*   06 సెప్టెంబర్‌, 2024 ఆర్‌ సి 21 శంకర్‌, దిల్‌ రాజుల  ‘గేమ్‌ చేంజర్‌’ 27 సెప్టెంబర్‌, 2024 న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌  ‘దే కాల్‌ హిం ఓ జి’
*   10 అక్టోబర్‌, 2024 ఎన్టీర్‌ కొరటాల శివ ల ‘దేవర’. (ముందు ప్రకటించిన తేదీ 15 ఆగష్టు,2024)
*   డిసెంబర్‌, 2024 అల్లు అర్జున్‌, సుకుమార్‌ ‘పుష్ప 2 ది రూలర్‌’ ఇంకా డేట్‌ ఫైనల్‌ చేయలేదు  (ముందు ప్రకటించిన తేదీ 15 ఆగష్టు, 2024)
*   ఇదే నెలలో పవన్‌ కళ్యాణ్‌  ‘హరి హర వీర మల్లు’ కూడా రిలీజ్‌ ప్లానింగ్‌ వుంది.
*   29 ఆగష్టు, 2024న నాని ‘సరిపోద్దా శనివారం’ 

ఈ రోజు వరకు పై సినిమాలు ప్రకటించిన విడుదల తేదీలు నిర్మాణం పూర్తి అయ్యేసరికి మళ్ళీ మారినా మారొచ్చు.

 

praneet praneet praneet obili-garuda

ఓటీటీ వలన లాభమా? నష్టమా?

సినిమా విడుదల తర్వాత నిర్మాతలకు అదనపు ఆదాయం డిజిటల్‌ రైట్స్‌ ద్వారా వచ్చేవి. వీసీఆర్‌లు మొదలుకొని సీడీల వరకూ ఆ పరంపర కొనసాగింది. కరోనా తరవాత నిర్మాతలకు మరొక ఆదాయ మార్గాన్ని చూపింది ఓటీటీ. చిత్రీకరణ పూర్తి చేసుకుని, కరోనా కారణంగా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఓటీటీ చాలా మంది నిర్మాతలను గట్టెక్కించింది. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు క్రమంగా థియేటర్‌లకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు. థియేటర్‌కు రావాలా? వద్దా? అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి, అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్‌లో కూర్చొనేందుకు ఆసక్తి చూపుతాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌2’, ‘అవతార్‌ 2’, ‘సలార్‌’, ‘విక్రమ్‌’ వంటి వాటిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమాలన్నీ దాదాపు నెలన్నర తర్వాతే ఓటీటీలో వచ్చాయి. అంటే 45 రోజుల తర్వాత. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘ఆదిపురుష్‌’, ‘బ్రో’ ‘సైన్ధవ్‌’ రవితేజ కొన్ని మూవీస్‌,  తదితర చిత్రాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చాయి. కొన్ని చిన్న చిత్రాలైతే వారానికే ఓటీటీ బాటపట్టాయి. థియేటర్‌లో కొనసాగలేని చిన్న చిత్రాల నిర్మాతలు ఓటీటీల ద్వారా గట్టెక్కారన్నది జగమెరిగిన సత్యం.

బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టిన సినిమాను మళ్లీ ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కానీ, పెద్దగా మెప్పించలేని సినిమాలను పదివారాల గడువు పెట్టుకుని ఓటీటీలో ఆలస్యం చేస్తే, ఎంతమంది చూస్తారన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే ప్రతివారం వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఇతర భాషల్లో సినిమాలను, తెలుగు ఆడియోతో, సబ్‌ టైటిళ్లతో చూసే ప్రేక్షకుల సంఖ్యా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఫ్లాప్‌ అయిన సినిమాలు ఓటీటీలో చూడాలన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. థియేటర్‌కు వెళ్తే, రెండున్నర గంటలు కూర్చోవాల్సిందే. కానీ, చేతిలో రిమోట్‌ ఉంటే ఓటీటీలో పూర్తి సినిమా చూసేవారూ తక్కువే. ‘థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలనే విషయమై ఎంతో రీసెర్చ్‌ జరుగుతోంది. ఫ్లాప్‌ అయిన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి లాభం చేకూరినట్టువుతుంది. కానీ, అది భవిష్యత్తులో థియేటర్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.  హిందీ లో  ‘రన్‌ వే 34’, సమ్రాట్‌ పృథ్వీరాజ్‌, ‘ధాకడ్‌’ ‘అటాక్‌’, ‘బచ్చన్‌ పాండే’ ‘డంకి’ ‘తేజస్‌’, ‘ఆదిపురుష్‌’  వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేక రెండు, మూడు వారాలకే ఓటీటీ బాటపట్టి, నష్టాల నుంచి కొంత మేర గట్టెక్కాయి. తెలుగులోనూ  ‘హాయ్‌ నాన్న’ ‘బ్రో’ ‘స్కంద’ ‘రావణాసుర’ ‘గాండీవధారి అర్జున’ ‘ఎక్సట్రా ఆర్డినరీ మాన్‌’ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని సినిమాలు పది వారాల నుండి వంద రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం ఎంత వరకూ సహేతుకమైందన్నది ఇప్పటికీ ఇంకా ఆలోచించాల్సిన విషయమే.

 

 

Vertex poulomi Png-jewelry
Tags :