Radha Spaces ASBL

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వై.ఎస్.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చుతూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసింది. దీంతో పేరు మార్పు త్వరలోనే అధికారికంగా అమల్లోకి రానుంది. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వై.ఎస్. పేరు పెట్టడం తీవ్ర దుమారానికి కారణమైంది. దేశంలోనే తొలిసారిగా హెల్త్ యూనివర్సిటీ పెట్టాలన్న ఆలోచన ఎన్టీఆర్ దేనని.. దానికి ఆయన పేరు ఉండడమే సబబని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. అయితే ఏపీలో నెలకొల్పిన మెడికల్ కాలేజీల్లో మెజారిటీ కళాశాలలు వై.ఎస్.ఆర్ లేదా ఆయన కుమారుడు జగన్ హయాంలో మాత్రమే ఏర్పడ్డాయని వైసీపీ చెప్తోంది. అందుకే ఎన్టీఆర్ కంటే వై.ఎస్.ఆర్. పేరు పెట్టడమే సబబని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం టీడీపీ - వైసీపీ శ్రేణుల మధ్య మరోసారి మాటల తూటాలకు కారణమైంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వై.ఎస్.ఆర్. పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవులకు రాజీనామా చేశారు. తెలుగుకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం కరెక్ట్ కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీలోనే ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి దీనిపై ఎందుకు స్పందించట్లేదని డిమాండ్ పెద్ద ఎత్తున మొదలైంది. అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడేమంటారని టీడీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి.

ఎన్టీఆర్ పేరు తీసేయడంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఒకరోజు ఆలస్యంగా దీనిపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. "NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయి పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు" అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

నొప్పింపక తానొవ్వక.. అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ పై మాత్రం సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఎప్పుడూ తాత పేరు జపించే జూనియర్ ఎన్టీఆర్ ఇలా అటుఇటు కాకుండా స్పందించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేయడం తప్పని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీస్తున్నారు. వై.ఎస్.ఆర్.ను ఎన్టీఆర్ తో పోల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావ్ అంటూ మరికొంతమంది ఎన్టీఆర్ అభిమానులు మండి పడుతున్నారు. మరికొందరైతే చిరంజీవిలాగా రాజకీయాలు మాట్లాడుతున్నావంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :