ASBL NSL Infratech

రివ్యూ : వీర నరకుడు ప్రధాన పాత్రలలో 'స్కంద'  

రివ్యూ : వీర నరకుడు ప్రధాన పాత్రలలో 'స్కంద'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, అజయ్ పుర్కార్, శరత్ లోహితాస్య, ప్రిన్స్, తదితరులు
సంగీతం: ఎస్ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ : సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: 29.09.2023

బోయపాటి చిత్రం అంటేనే ముందుగా డిసైడ్ అవ్వొచ్చు!  వరుసగా అయన చిత్రాలు  చూసుకుంటే.. భద్ర, తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయిక, వినయ విధేయరామ, అఖండ.. కథ ఏదైనా సరే కాన్సెప్ట్ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా రొటీన్ మాస్ ఫార్మేట్‌లోనే ఉంటుంది. హీరో ఉంటాడు.. హీరోయిన్ ఉంటుంది.. హీరో ఫ్యామిలీకో.. తప్పితే హీరోయిన్ ఫ్యామిలీకో విలన్ నుంచి ప్రమాదం ఉంటుంది.. అది హీరోకి తెలుస్తుంది. అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్.. ఆ తరువాత హీరో సమస్యల్లో ఉన్న తన కుటుంబాన్ని.. లేదంటే హీరోయిన్ కుటుంబాన్ని రక్షిస్తాడు.. విలన్‌‌ని కండకండాలుగా నరికి మట్టుపెడతాడు. అఖండ సినిమా తరువాత ‘స్కంద’లోనూ డ్యుయెల్ రోల్ ఫార్ములాని రిపీట్ చేశారు. అదే కథ.. అదే కథనం.. అదే క్లైమాక్స్. అయితే ఈసారి ప్రాబ్లమ్ హీరోకో.. హీరోయిన్ ఫ్యామిలీకో కాదు.. హీరో స్నేహితుడుకి మలుపు తిరిగింది కథ. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, బిజీ హీరోయిన్ శ్రీ లీల, బోయపాటి కాంబి లో వచ్చిన ఈ చిత్రం టార్గెట్ చేసిన మాస్ ప్రేక్షకుడిని ఏ మేరకు ఆకట్టుకుందో? సమీక్షలో చూద్దాం  

కథ:

ఇక కథలోకి వెళితే...  ఆంధ్రా సీఎం (అజయ్ పుర్కార్)  కూతుర్ని తెలంగాణ సీఎం (శరత్ లోహితాస్య) కొడుకు పెళ్లి పీటలమీదుండగానే  లేపుకుని పోవడంతో ‘స్కంద’ కథ మొదలౌతుంది. ఆంధ్రా సీఎం అంటే జగనూ.. తెలంగాణా సీఎం అంటే కేసీఆర్ కాదండోయ్.. బోయపాటి కథలో ఇక్కడ ఇద్దరు సీఎంలు విలన్లన్నమాట. తన కూతుర్ని లేపుకునిపోవడంతో.. తెలంగాణ సీఎం కొడుకుని లేపేయడానికి ఆంధ్రా సీఎం ఒకడికి సుపారీ ఇచ్చి పంపిస్తాడు. వాడే  ధీరుడు వీరుడు సూరుడైన స్కంద (రామ్ పోతినేని)కి తన కూతుర్ని తీసుకొచ్చే బాధ్యతని అప్పగిస్తాడు ఆంధ్రా సీఎం. అయితే స్కంద ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా..  ఈ కథలో దున్నపోతులను ఆడించే వాడిగా ఎంట్రీ ఇచ్చి అటు ఆంధ్రా సీఎం కూతుర్నీ (సయి మంజ్రేకర్).. ఇటు తెలంగాణ సీఎం కూతురు (శ్రీలీల) లేపుకుని తన సొంత ఊరు రుద్రరాజ పురానికి తీసుకుని వస్తాడు. ఈ ఇద్దరు సీఎంలకు.. ఈ రుద్రరాజపురానికి లింక్ ఏంటన్నది ఒక ట్విస్ట్ అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. రుద్రరాజపురానికి పెద్ద మణికంఠరాజు (దగ్గుబాటి రాజా). మణికంఠ రాజు కొడుకే స్కంద. అలాగే మణికంఠ రాజు ప్రాణ స్నేహితుడే రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్). ఇతను క్రౌన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవోగా ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని.. ఈ ఇద్దరు సీఎంలు అక్రమ కేసులో ఇరికించి ఉరి కంభం ఎక్కించబోతారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం.. రామకృష్ణ రాజుని అతని కుటుంబాన్ని ‘స్కంద’ ఎలా కాపాడగలిగాడు. ఆ ఇద్దరు సీఎంలను ఎలా మట్టుపెట్టాడు అన్నదే మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు:

‘స్కంద’ అంటే కుమారస్వామి కానీ..ఈ చిత్రంలో రామ్‌ని నరసింహస్వామి అవతారంలో చూపించాడు బోయపాటి. రామ్ నటన ఎప్పటిలాగే హైఎనేర్జిటిక్ గా వుంది. ఇంతకు ముందు జగడం, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలలో ఇదే తరహా పాత్రలు చేసాడు. ఈ చిత్రంలో మాత్రం వూరమస్ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. మాస్ డైరెక్టర్ చేతిలో మాస్ హీరో పడితే.. ఉప్పొచ్చి నిప్పుపై పడ్డట్టే. చిటపటలు మామూలుగా ఉండవు. ‘స్కంద’ కూడా అలాంటిదే. సినిమా మొదలైంది మొదలు ఎండ్ కార్డ్ పడే వరకూ కూడా నరుకుడే నరుకుడు. రక్తం ఏరులైపారింది. హీరోయిన్లు శ్రీ లీల, సయి మంజ్రేకర్, పాత్రల పరిధి చాలా తక్కువ శ్రీ లీల మరోసారి తన డాన్సులతో ఆకట్టుకుంది. రామకృష్ణ రాజుగా శ్రీకాంత్‌కి మంచి రోల్ పడింది. కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా స్కంద కథకి హీరో అతనే. చాలారోజుల తరువాత దగ్గుబాటి రాజా.. హీరోకి తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు.మిగతా వారు తమ తమ పాత్రలమేరకు నటించారు.  

సాంకేతికవర్గం పనితీరు:

భద్ర నుంచి అఖండ వరకూ బొయపాటు తొమ్మది సినిమాలు తీస్తే.. అందులో ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్. అదీ బోయపాటి మార్క్ అంటే. ఆరంభంలో హ్యాట్రిక్ విజ‌యాలు న‌మోదు చేసిన ఘ‌న‌త బోయపాటికే దక్కింది. అవి కూడా అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన ఊర మాస్ చిత్రాలవి. చంద్రబాబుతో బోయపాటికి ఉన్న సాన్నిహిత్యమో.. లేదంటే హీరో రామ్‌కి ఏపీ గవర్నమెంట్‌పై ఉన్న కోపమో తెలియదు.. ఇన్ డైరెక్ట్‌గా ఏపీ గవర్నమెంట్‌ని బాగానే కోకారు. ‘బూం.. బూం బీర్లు’పై సెటైర్లు కానీ.. ‘నిద్రపోతున్నవాడ్ని చంపడం నీకు అలవాటేమో.. లేపి చంపడం నాకు అలవాటు’, ‘ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డం వస్తే లేపాలే.. ఇప్పుడు సీఎంలు అయినవాళ్లు ఇలా అయినవాళ్లే కదా’.. అని హీరో చెప్పే డైలాగ్‌లు ఇన్ డైరెక్ట్‌గా గట్టిగా తగిలేట్టుగానే ఉన్నాయి.  ఫైటూ.. పాటా.. ఫైటూ.. పాటా.. ఈ ఫార్మేట్ మాత్రం వదల్లేదు బోయపాటి. అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చాడు బోయపాటి. కథల్లో ఎక్కడా కనిపించని కొత్తదనం మాత్రం.. హీరోలను లేపడంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రామ్‌కి ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. దానికి తగ్గట్టు తమన్ మ్యూజిక్. వీరబాదుడు బాదేశాడు. ఓ లెక్క పత్రం లేకుండా తమన్.. కొట్టుకుంటూ పోయాడు తప్పితే.. సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా అయితే లేవు. ఇక పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో.. తమన్ మ్యూజిక్ ‘స్కంద’లో వర్కౌట్ కాలేదు.

విశ్లేషణ:

బోయపాటి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధానంలో వ్యవస్థని లేక్కేచేయడు. వాస్తవానికి దూరంగా వ్యవస్థలతో ఆటాడేస్తుంటాడు. ఏంటీ.. ఇలా కూడా చేయొచ్చా అనే ప్రశ్నలు వస్తుంటాయి కానీ.. బోయపాటి మాత్రం అందంతా డోన్ట్ కేర్.. వెయ్ నా కొడుకుని వెయ్ అని ఆడియన్స్‌తో అనిపించామా లేదా అన్నదే ముఖ్యం. హీరో ఒక్క గుద్దికి విలన్లను చంపేస్తుంటాడు కానీ.. విలన్లు బులెట్ల వర్షం కురిపిస్తున్నా కూడా హీరో రొమ్మునిక్కబొడిచి మరీ దూసుకొచ్చేస్తుంటాడు అతనికి ఏం కాదు.. దటీజ్ బోయపాటి. ఏదో సర్పంచ్ ఇంటికెళ్లినట్టు హీరో గేట్లను తన్నుకుని విలన్ ఇంట్లోకి  వెళ్లిపోవడం కాదు.. ఈ సినిమాలో అయితే ఏకంగా సీఎంలనే రంగంలోకి దింపేశాడు. సినిమా మొత్తం లెక్కపత్రం లేని నాన్ స్టాప్ నరుకుడు.. విలన్ చెప్పినట్టు ఇది బాణం కాదు గునపమే..ప్రేక్షకుడికి గట్టిగానే దింపాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :