నమ్మకమే ముంచేస్తే ఎలా సలార్?
మరో పది రోజుల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా థియేటర్లలోకి రానుంది. కానీ ఇప్పటివరకు సలార్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు. ఈ విషయం ఫ్యాన్స్ ను చాలా నిరాశకు గురిచేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేస్తారో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఉంటే ఇప్పటికే దానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోసం లెటర్స్ రాసి ఉండాలి. కానీ ఆ దిశగా మేకర్స్ ప్రయత్నాలు చేసినట్లు కనిపించడం లేదు.
మొదటి ట్రైలర్ కంటే నెక్ట్స్ లెవెల్ లో యాక్షన్ ఉండేలా మరో ట్రైలర్ ను ఇప్పటికే కట్ చేయించారని వార్తలొచ్చాయి కానీ అదైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మరి. కేజీఎఫ్ సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసిన నిర్మాణ సంస్థ సలార్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉందనేది ఎవరికీ అర్థం కాని అంశం. కంటెంట్ మీద నమ్మకంతోనే సలార్ మేకర్స్ సైలెంట్ గా ఉంటున్నారనేది కొందరి మాట.
కానీ ఎంత కంటెంట్ బాగున్నా సరే సినిమాకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమనేది రాజమౌళి సినిమాలను చూసైనా అర్థం చేసుకోవాలి. సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోతే లాంగ్ రన్ కష్టమనేది సలార్ మేకర్స్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరోవైపు ఈ సినిమాతో పాటూ రిలీజ్ అవుతున్న డంకీ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికైనా మేకర్స్ తమ ఆలోచనను మార్చుకుని బయటకు వస్తే బెటర్. కంటెంట్ పై నమ్మకముండొచ్చు కానీ ఆ నమ్మకమే సినిమాను ముంచేస్తే చాలా తీవ్ర నష్టం కలిగే ప్రమాదముంది.