ఎవరు ఎన్ని చేసినా.. ప్రజల ఓటు జగనన్నకే.. సజ్జల..
ఆంధ్రాలో పోలింగ్ గట్టం పూర్తయిన నేపథ్యంలో పలువురు నేతలు పోలింగ్ పై స్పందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కు మహిళలు, పేదలు భారీగా మద్దతు తెలిపారని అన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా.. వైసీపీ కు సానుకూలంగా ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2019లో కూడా ఇదే తరహాలో పోలింగ్ జరిగిందన్న సజ్జల.. ఈసారి కూడా జగన్ ఆశించినట్లే పోలింగ్ నమోదయింది అని పేర్కొన్నారు. అయితే 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా పోలైందని.. ఈసారి మాత్రం ప్రభుత్వానికి సానుకూలంగా పెద్ద ఎత్తున ఓట్లు పోల్ అయ్యాయని ఆయన అన్నారు. అంతే కాదు ఎలక్షన్స్ సందర్భంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా.. తమ పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించారని సజ్జల పేర్కొన్నారు. కుప్పం, మాచర్ల, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురం, వినుకొండ లాంటి పలు నియోజకవర్గాల్లో పోలీసులు పసుపు దళం తో కుమ్మక్కయ్యారు అని ఆరోపించారు. టీడీపీ కొన్ని నియోజకవర్గాలలో రిగ్గింగ్ కి కూడా పాల్పడింది అని సంచలన ఆరోపణలు చేశారు . తమ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే 80కు పైగా ఘటనల గురించి ఈసీ కు ఫిర్యాదు చేశామని సజ్జల అన్నారు.