ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : కథలో రూల్స్ మరిచిన 'రూల్స్ రంజన్'

రివ్యూ : కథలో రూల్స్ మరిచిన 'రూల్స్ రంజన్'

తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది,
వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్,
గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్, కెమెరా  : దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్, ఎడిటర్ : వరప్రసాద్
సహ నిర్మాత: రింకు కుక్రెజ, సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
విడుదల తేదీ : 06.10.2023
 
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం 'రూల్స్ రంజన్'.  ఈ  ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది.కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.  వరుస పరాజయాలతో కెరీర్ సాగుతున్న కిరణ్ అబ్బవరరానికి ఈ సారైనా హిట్ దక్కిందా? మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:

తిరుపతిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మిడిల్ క్లాస్ స్టూడెంట్ మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్‌గా ఉద్యోగాన్ని పొందుతాడు. మనో రంజన్ కి హిందీ  రాక.. ఆఫీస్‌లో తెలుగు వాళ్లు లేక నానా ఇబ్బందులు పడతాడు. అతని బలహీనతే భాష రాకపోవడం.. దాన్ని అవకాశంగా తీసుకుని.. అక్కడి  ఆఫీస్‌ స్టాఫ్  ఆడుకుంటారు. చేయని తప్పులకు నిందలు భరిస్తూ ఉంటాడు మనో రంజన్. చివరికి తన చుట్టూ ఏదో జరుగుతుందని తేరుకున్న మనో రంజన్.. అలెక్సా సాయంతో హిందీ నేర్చుకుంటాడు. తనపై పడ్డ నిందల్ని చెరిపేసుకోవడమే కాకుండా.. టీం లీడర్‌గా మారి.. మేనేజర్‌ని శాసించే స్థాయికి వెళ్తాడు. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉండే మనో రంజన్.. ఆఫీస్‌లో రూల్స్ పెట్టి.. ‘రూల్స్ రంజన్‌’గా మారతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సనా (నేహా శెట్టి) రంజన్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆమె ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఆమెను చూసి ఇష్టపడతాడు. ఆ విషయం ఆమెకి కూడా తెలియదు. అనూహ్యంగా ఓరోజు సనని ముంబైలో చూస్తాడు. ఇంటర్వ్యూ విషయంలో ఆమెకు హెల్ప్ చేస్తాడు. మనో రంజన్ తనని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గమనించిన సన, ఓ రోజంతా అతనితో గడుపుతుంది. ఆ తరువాత సన, తిరిగి తిరుపతి వచ్చేసిన తరువాత,  సనపై ప్రేమని పెంచుకుంటాడు మనో రంజన్. ఆమెను వెతుక్కుంటూ.. తిరిగి తిరుపతి వస్తాడు. ఆ తరువాత మనో రంజన్‌కి ఎదురైన పరిస్థితులు ఏంటి? సన ప్రేమను పొందడానికి మనో రంజన్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటన్నదే మిగతా  కథ.

నటీనటుల హావభావాలు :

మనోరంజన్ పాత్రలో  కిరణ్ అబ్బవరం మంచి ఈజ్‌తో చేశాడు. తిరుపతి యాసలో తనకు నప్పే బాడీ లాంగ్వేజ్ చూపించాడు.ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ, కథలో పస లేకపోవడంతో, అతని పాత్ర తేలిపోయింది. అవసరం వున్నా లేకున్నా ఎక్కువగా  బిల్డప్పులు ఇవ్వడం,  హీరో అబ్బవరానికి అలవాటైన పని. హీరోని అనుకుని కథలు రాసే పరిస్థితులు పోయాయని ఇంకా కిరణ్ అబ్బవరం కనిపెట్టలేకపోయాడనుకుంటా!  భారీ ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లను పెట్టేసి.. మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో బీభత్సమైన బిల్డప్‌లతో ఐదారు ఫైట్లు, పాటలు పెట్టేసి కథ లేకుండా కాలక్షేపం కానిచ్చేద్దాం అనుకుంటే కుదరదని ఇంకా ప్రేక్షకుడిని అర్ధం చేసుకోలేదు. కిరణ్ అబ్బవరం టాలెంట్ ఉన్న నటుడే.. హీరో మెరిటీయల్ కానీ అతనికి సూటయ్యే కథల్ని ఎంచుకోకపోవడమే అతని మైనస్. అదే విధంగా డీజే టిల్లులో రాధిక గా మెప్పించిన నేహాశెట్టి, రూల్స్ రంజన్‌లో సన‌గా ఆకట్టుకోలేకపోయింది.  ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో నేహా శెట్టి అక్కట్టుకోలేక పోయింది.  హీరోకు స్నేహితులుగా నటించిన హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన మెహర్ చాహల్ నటించడానికి బాగానే తాపత్రయ పడింది. వెన్నెల కిశోర్, సుబ్బరాజు, అజయ్, మకరంద్ దేశ్‌పాండే, గోపరాజు రమణ లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

సాంకేతికవర్గం పనితీరు :

దర్శకుడు రథినం కృష్ణ (నిర్మాత  ఏ ఎం రత్నం కొడుకు) ఈ మూవీని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేకపోయారు.  ఆక్సిజన్ సినిమా ఫెయిల్యూర్‌ తనకి చాలా పాఠాలు నేర్పించిందని చెప్పిన దర్శకుడు రథినం కృష్ణ ఈ  సినిమా చూస్తే, ఆ పాఠాలు అతనికి బుర్రకెక్కలేదేమో అనిపిస్తుంది ‘రూల్స్ రంజన్’  కథ చెప్పడంలో ఎన్ని రూల్స్‌ బ్రేక్ చేసినా పర్లేదు కానీ, ఆడియన్స్‌కి బోర్ కొట్టించకూడదనే మెయిన్ రూల్‌‌ని ముందే బ్రేక్ చేశారు దర్శకుడు రథినం కృష్ణ . కథ తిరుపతి నుంచి ముంబై షిఫ్ట్ అయిన తరువాత మనో రంజన్ రూల్స్  రంజన్‌గా మార్చేందుకు దర్శకుడు చూపించిన సీన్లు చాలా సిల్లీగా అనిపిస్తాయి. కెమరామెన్  దులీప్ కుమార్. సినిమాలోని ప్రతి సీన్ ని విజువల్ గా ఎంతో అందంగా చూపించారు. సంగీత దర్శకుడు  ఎం.ఎస్. అమ్రిష్ గణేష్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రేమ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్ కూడా ఆకట్టుకుంది. అలానే నిర్మాతలు నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ:

క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా?? లేచి వెళ్లిపోదామా అని ఎదురుచూసే పరిస్థితి కల్పించారు. క్లైమాక్స్‌ కాస్త పర్వాలేదే అనిపిస్తుంది కానీ,  పేక ముక్కల్ని మార్చినట్టుగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల్ని మార్చేస్తుంటారు. ఎవరు? ఎవర్ని పెళ్లి చేసుకుంటారు.. ఎందుకు చేసుకుంటారు.. పెళ్లి అంటే అంత ఈజీనా అనేట్టుగా గజిబిజి గందరగోళం చేసిపారేశారు. ఓవరాల్ గా ఈ ‘రూల్స్ రంజన్’ కొన్ని చోట్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, అలాగే ఫేక్ ఎమోషన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. రెండు గంటల 40 నిమిషాల పాటు ఈ రూల్స్ భరించడం ప్రేక్షకుడికి సహనానికి పరీక్షే!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :