తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధం : అమెరికా
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ చైర్మన్ రిచర్డ్ రసో తెలిపారు. భారత్‌లోని అనేక రాష్ట్రాల్లో తమ సంస్థ విద్యుత్ రంగంలో పలు కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్కమ్‌లలో సంస్కరణలు, ప్రైవేట్ డిస్కంలు, ఎనర్జీ స్టోరేజ్, విద్యుత్ సామర్థ్యం పెంపు తదితర అంశాల్లో తమకున్న అనుభవాన్ని తెలిపారు.
రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా లేదా అత్యంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ లేదా అమెరికాలోని ఎన్జీవోలు ఏ మేరకు ఆసక్తిగా ఉన్నాయని రిచర్డ్‌ను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. సౌర, పవన విద్యుత్ లాంటి ప్రత్యామ్నాయ విద్యుదుత్పత్తి రంగాల్లో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలు తీసుకున్నాయని, ఈ రంగంలో అది తక్కువ వడ్డీ రేటుకు పెట్టుబడి సాయం అందించగలిగితే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని రిచర్డ్‌కు మంత్రి ఉత్తమ్ వివరించారు.