ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : మత చరిత్ర కాదు..గత చరిత్రగా 'రజాకార్'

రివ్యూ : మత చరిత్ర కాదు..గత చరిత్రగా 'రజాకార్'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : సమర్‌వీర్ క్రియేషన్స్, ఎల్‌ఎల్‌పి
నటి నటులు : బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, తులసి, ప్రేమ, ఇంద్రజ, జాన్, రాజ్ అర్జున్,
అనసూయ భరద్వాజ్, తేజ్ సప్రు, మకరంద్ దేశ్‌పాండే తది తరులు నటించారు.
ఛాయాగ్రహణం: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం : భీమ్స్ సిసిరోలియో
పాటలు : సుద్దాల అశోక్ తేజ్, కాసర్ల శ్యామ్, ఎడిటర్ :తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ : తిరుమల ఎం త్రిపాఠి, నిర్మాత : గూడూరు నారాయణ రెడ్డి
రచన, దర్శకత్వం: యాటా సత్యనారాయణ
విడుదల తేదీ :15. 03. 2024
నిడివి : 2 ఘంటల 35 నిముషములు


యావత్ భారతదేశం స్వాతంత్య్రాన్ని ఆగస్ట్‌15 న, గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న  పండగలా జరుపుకుంటుంది. ఆనాడు  హైద్రాబాద్ కు మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం రాని తరుణంలో చోటు చేసుకున్న సందర్భాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం”రాజాకర్”. 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది చిత్ర కథాంశం. చరిత్రలో కలిసిపోయిన కొన్ని కథలు ఈ  సినిమా ద్వారా బయటకు బహిరంగంగా చెప్పాలని, మన చరిత్ర మనకు మన తర్వాత తరాల వారికి తెలియాలని, నిరంకుశంగా పాలించిన నిజాం పరిపాలన. నిజాం గురించి నిజాంల పరిపాలన గురించి కాశిం రజ్వీల గురించి క్షుణ్ణంగా తెలియచెప్పే చిత్రమే ‘రజాకర్‌’. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్మించిన ఈ ‘రజాకర్‌’ సినిమా హిట్టా? ఫట్టా? ట్రైలర్ తోనే చిన్నపాటి సంచలనం సృష్టించి, చిత్రం విడుదల నిలిపివేతపై హై కోర్ట్ కెక్కినా ఈ చిత్రం నేడు (మార్చి 15) థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాగా “రజాకర్” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం..!!  

కథ :

1947 ఆగస్టు 15న యావత్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాంలు పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అప్పటి నిజాం ప్రభువు హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. వీరి సంస్థానంలోనే కర్ణాటక, మహారాష్ట్రలలో కొన్ని ప్రాంతాలు ఉండిపోయాయి. హైద్రాబాద్ ను పరిపాలిస్తున్న నైజాం సంస్థానం మాత్రం స్వతంత్ర భారతంలో కలవడానికి నిరాకరిస్తుంది. నైజాం ప్రజలు స్వాతంత్ర్యం కోసం తపిస్తుండగా.. రజాకర్ వ్యవస్థ మాత్రం వారిని హింసిస్తూ స్వాతంత్ర్య భావనను చంపేసి, హైద్రాబాద్ ను తుర్కిస్తాన్ గా మార్చడం కోసం పరితపిస్తుంటుంది. నిజాం రాక్షస పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు తిరగబడ్డారు. వాళ్లని అణచివేయడానికి నియమింపపడ్డ నాయకుడే సయ్యద్ ఖాసీం రజ్వీ. నిజాం పరిపాలనలో నెత్తుటి మరకగా నిలిచాడు ఇతను. రజాకార్ల సైన్యాన్ని ముందుండి నడిపి తెలంగాణ పోరాట యోధుల్ని అణచివేసి నరమేధం సృష్టించాడు.

హైదరాబాద్ సంస్థానాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసిన రజాకార్లను రాక్షస మూకగా మార్చిన చరిత్ర ఖాసీం రజ్వీది. అంతేకాదు.. 1927లో నాటి నిజాం ప్రభువు బహదూర్ యార్ జంగ్.. ముస్లిం మత విస్తరణ, సాంస్కృతిక వైభవమే ధ్యేయంగా ‘ఎంఐఎం’ పార్టీని స్థాపించారు. అయితే 1944లో బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద మృతి తరువాత.. ఎంఐఎం నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఎంఐఎం స్వరూపమే మారిపోయింది. రజాకార్లను రాక్షస మూకలుగా మార్చి.. నిజాం విముక్తి కోసం సాగే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేశాడు. అందుకోసం దాదాపు 2 లక్షల మంది రజాకార్లను సిద్ధం చేశాడు ఖాసీం రజ్వీ. నిజాం పాలనలో రజాకార్ల రాక్షసత్వానికి అంతేలేకుండా పోయింది.

నిజాం పాలనకి వ్యతిరేకంగా పని చేసే వాళ్లని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసేవారు. పన్నులు, ప్రజల ఆస్తుల్ని దోచుకోవడంతో పాటు.. ఇళ్లలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు తెగపడేవారు. హిందూ సాంప్రదాయాలను అణచివేయడం.. బలవంతంగా మత మార్పిడిలు చేసేవారు. ఆడాళ్లని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించి రాక్షస ఆనందం పొందేవారు. 1948 ఆగస్టు 27న ఖాసీం రజ్వీ నాయకత్వంలో బైరాన్‌పల్లిని చుట్టుముట్టిన 400 మంది రజాకార్లు నరమేధం సృష్టించారు. 118 మంది ప్రాణాలను బలిగొన్నారు. తమకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లని తరిమితరిమి కాల్చి చంపారు. ఆడ, మగ, పిల్ల, ముసలి తేడా లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. మహిళల్ని వివస్త్రల్ని చేసి.. చనిపోయిన శవాల చుట్టూ బతుకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందారు. రజాకర్ వ్యవస్థ, ప్రజలు మరియు భారత ప్రభుత్వం మధ్య జరిగిన ఈ ప్రచ్చన్న యుద్ధంలో ఎవరు గెలిచారు? అనేది “రజాకర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల హావభావాలు:

ఈ సినిమా విషయంలో ఎక్కువగా ఆశ్చర్యపరిచేది క్యాస్టింగ్ ఎంపిక. తెలుగు నటీనటులకంటే  తమిళ, హిందీ క్యాస్టింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి చిన్న పాత్రలో సీనియర్ స్టార్ యాక్టర్ కనిపిస్తుంటాడు. గత కొంతకాలంగా కనిపించకుండాపోయిన తమిళ నటులందరూ ఒక్కసారిగా తెరపై కనిపించేసరికి ఆశ్చర్యపడడం ప్రేక్షకుల వంతవుతుంది. లెక్కకు మించిన  ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ (తేజ్ సప్రు) ఎక్కువ మార్కులు కొట్టేశాడు. నిజాం ప్రభువుగా (మకరంద్ దేశ్ పాండే).. ఖాసీం రజ్వీగా (రాజ్ అర్జున్).. వీళ్లిద్దరి ఎంపికే సినిమాకి మేజర్ హైలైట్. రజ్వీని తెరపై చూస్తుంటే.. చంపిపడేయాలి నా కొడుకుని అని చూసే ఆడియన్స్ రగిలిపోతుంటారంటే.. ఆ పాత్రలో అతనెంత పరకాయ ప్రవేశం చేశాడో అర్ధం చేసుకోవచ్చు. ఇంద్రజ, ప్రేమ, వంటి సీనియర్ హీరోయిన్లు చిన్నపాటి షాక్ ఇచ్చారు.   అనసూయ కనిపించేది ఒక్క పాటలోనే అయినా.. ఆ పాటే సినిమాకి కొండంత బలం. ఇక చాకలి ఐలమ్మగా ఇంద్రజ వీరత్వం సినిమాకి మరో ప్లస్. ‘లం** అంటావ్ రా... లం** కొడకా అంటూ గుండెల్లో ఎగిరితన్నే సీన్ అయితే గూస్ బంప్స్. ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య ఇలా అనేక పాత్రల్లో కనిపించవాళ్లంతా.. చరిత్రను గుర్తు చేశారు. బాబీ సింహా., అనుశ్రియా త్రిపాఠి,  తదితరులు తమ పాత్రలకు జీవం పోశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

పుట్టాం కాబట్టి బతకాలి.. చచ్చేవరకూ ఉండాలనే పరిస్థితుల్లో మతోన్మాద అరాచకాలకు దర్పణంగా.. తెలంగాణ రక్త చరిత్రకి అద్దం పట్టేలే రజాకార్ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు యాట సత్యనారాయణ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. పాపులర్ సీరియల్ డైరెక్టర్ కావడంతో.. చరిత్ర పుటల్ని వెలికితీయడానికి సీరియస్‌గా  ప్రయత్నించారు. ‘‘మా రక్తంలోనే ఉంది చరిత్రను గుర్తించుకోవడం.. మా రక్తంలోనే ఉంది పూర్వీకుల్ని గుర్తించుకోవడం.. మా రక్తంలోనే ఉంది మూలాలను గుర్తించుకోవడం.. మా రక్తంలోనే ఉంది అస్తిత్వాలను గుర్తించుకోవడం.. అలా గుర్తించుకున్నాం కాబట్టే రజాకార్ బయటకు వచ్చింది. మా రక్తం మరిగిన రోజులు మీకు గుర్తుకు రావాలనే ఈ సినిమా’’ అంటూ రజాకార్ల రాక్షసత్వంపై ఎక్కుపెట్టిన బాణంలా ఈ సినిమాను రూపొందించారు. 1947 నుంచి 1948 బ్యాక్‍డ్రాప్‍లో ‘రజాకార్’ వ్యవస్థను రణరంగంగా చూపించాడు దర్శకుడు యాటా సత్యనారాయణ.

ఒకటి మాత్రం నిజం.. రజాకార్ సినిమా చూసిన తరువాత ఎవరి గురించి మాట్లాడుకున్నా.. మాట్లాడుకోకపోయినా.. దర్శకుడు యాటా సత్యనారాయణ గురించి మాత్రం తప్పక మాట్లాడుకుంటారు. గుర్తుపెట్టుకుంటారు. కథ కోసం వెతకాల్సిన పని లేకుండా.. చరిత్రను చెప్పుకుంటూ.. బలమైన పాత్రలతో సన్నివేశాలను కళ్లకి కడుతూ.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ.. రజాకార్లను వేటాడేశాడు దర్శకుడు యాటా సత్యనారాయణ.  రజాకార్ చరిత్రను చెప్తూ.. వీక్షకుల్ని 1947 - 1948 బ్యాక్‍డ్రాప్‍లోకి తీసుకుని వెళ్లారంటే.. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం త్రిపాఠి పనితనం అద్భుతం అనే చెప్పాలి. ఏ ఫ్రేమ్ చూసుకున్నా.. భారీతనమే కనిపిస్తుంది. స్క్రీన్ మొత్తం ఆర్టిస్ట్‌లతో నిండుగా కనిపిస్తుంది. కుశేంద్ర రమేష్ రెడ్డి కెమెరా వర్క్ రజాకార్ సినిమాకి సరిగ్గా సెట్ అయ్యింది.

దర్శకుడి ఆలోచనకు దృశ్యరూపంగా ఇవ్వడం అంటే ఇదేనేమో అన్నట్టుగా.. కొన్ని కొన్ని సీన్లలో కేవలం డైలాగ్‌లు లేకుండా.. అలా చూస్తూ ఎమోషనల్ అయ్యామంటే.. అతని కెమెరా పనితనమే కారణం. ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్.. భీమ్స్ సిసిరోలియో సంగీతం. ఇలాంటి కథకి.. ఇలాంటి నేపథ్య సంగీతమే ఉండాలి.. ఇలాంటి పాటలే కావాలి అన్నట్టుగా అద్బుతం అనిపించారు. ఏదీ కూడా పాటగా అనిపించదు.. కథను ముందుకు తీసుకెళ్లే ఆయుధంగా మాత్రమే కనిపిస్తుంది. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ తమ అద్బుత సాహిత్యంతో.. రజాకార్లను చీల్చి చెండాడారు. పాటతోనే నిజాం కోటను బద్దలుకొట్టొచ్చనేంతగా తమ సాహిత్యంతో అబ్బురపరిచారు. భారతి భారతి ఉయ్యాలో.. పొద్దుగాడ.. ప్రాణం గడ్డిపో అనుకో.. ఇలా ఒక్క పాటని మించి మరో పాట అనేట్టుగా ఉంటుంది. బీజేపీ నాయుకుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. భారీ స్థాయిలో  ఎక్కడా రాజీ పడకుండా దమ్మున్న నిర్మాతగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటారు.

విశ్లేషణ :

రజాకార్‌లో చరిత్రను చూపించారా? లేదంటే చరిత్రను వక్రీకరించారా? అన్నది పక్కనపెడితే..  కాస్తంత సహజత్వం లోపించిన మాట వాస్తవమే అయినప్పటికీ.. రజాకర్ వ్యవస్థ సృష్టించిన హింసను కుదిరినంత నిజాయితీగా తెరకెక్కించబడిన చిత్రం “రజాకర్”. ముస్లిం కమ్యూనిటీ నుండి కాస్తంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. చరిత్రపుటల్లో పేర్కొన్న హింసతో పోల్చితే చాలా నామమాత్రంగా చూపిన చిత్రం కావడం, రజాకర్ వ్యవస్థ కారణంగా హింసింపబడిన సమాజాలు, వ్యక్తులు ఇంకా తెలంగాణలో ఉండడం ఈ సినిమాను ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దీన్నొక మత పోరాటంగా కాకుండా.. స్వాతంత్ర్య పోరాటంగా భావిస్తే తప్పకుండా నచ్చతుంది. ఇది మత చరిత్ర కాదు.. గత చరిత్ర అనుకుంటేనే రజాకార్ అన్ని వర్గాలకు చేరువైతుంది. హిందుత్వం పేరుతో అరాచకాలకు తెగబడి.. మత విద్వేషాలు రగిల్చే ఉన్మాదులు ‘రజాకార్’ సినిమాకి ఎంత దూరంగా ఉంటే సినిమా నిలబడుతుంది. అల్లర్లు రేపే మత ఉన్మాదులు భుజాన వేసుకుంటే మాత్రం ఇది ఓ మతానికి సంబంధించిన సినిమాగా ‘చరిత్ర’లో మిగిలిపోకమానదు. బ్యాన్ చేసినా చెయ్యొచ్చు! ఈ సినిమా చూసేందుకు త్వర పడండి!!

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :