Radha Spaces ASBL

ఏపీ ఎన్నికలు... ప్రత్యక్ష రాజకీయాల్లోకి పలువురు ఎన్నారైలు

ఏపీ ఎన్నికలు... ప్రత్యక్ష రాజకీయాల్లోకి పలువురు ఎన్నారైలు

టిడిపి అభ్యర్థిత్వం దక్కించుకున్న సురేష్‌ కాకర్ల, రాము వెనిగళ్ళ

అమెరికాలో ఉంటున్న పలువురు ఎన్నారైలు ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి పలువురు ఎన్నారైలు ఇప్పటివరకు తెరవెనక పాత్ర పోషించేవారు. తమకునచ్చిన రాజకీయ పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తుండటం, విదేశాల్లో విరాళాలు సేకరించడం, సాంకేతిక సహాయంలాంటివి అందిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం డైరెక్టుగా తాము మద్దతు ఇస్తున్న పార్టీల తరపున అసెంబ్లీ బరిలో, లోక్‌ సభ బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీలు కూడా గెలుపుకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లోకి దూసుకువెళుతున్న ఎన్నారైలను తమ గెలుపుకోసం ఉపయోగించుకుంటున్నాయి. తెలుగు దేశం పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు ఎన్నారైలకు టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా వైసీపీ తరఫున నలుగురు టికెట్లు ఆశిస్తున్నట్లు వార్త. అలాగే జనసేన నుంచి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి వార్తలు ఉన్నప్పటికీ ఈ విషయమై స్పష్టత రాలేదు.  

ఆది నుంచి తెలుగు దేశం పార్టీకి అమెరికాలో ఎన్నారైల నుంచి మంచి మద్దతు ఉంటూ వస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పలువురు ఎన్నారైలు టిడిపి తరపున పోటీ చేసేందుకు సిద్ధమై వచ్చారు. వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు. అందులో భాగంగా తొలివిడత విడుదల చేసిన జాబితాలో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమెరికాలో ఉంటున్న ఎన్నారై సురేష్‌ కాకర్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. అలాగే గుడివాడలో మరో ఎన్నారై రాము వెనిగళ్ళకు సీటును కేటాయించింది. వీరిద్దరూ గత సంవత్సరకాలంగా తమ తమ నియోజకవర్గాలలో ట్రస్టులను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఇప్పుడు టిక్కెట్టు రావడంతో తమ విజయావకాశాలను పెంపొందించుకునేందుకు వీలుగా ఇతర నాయకులను కలుస్తూ, తమ గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. 

టిడిపి టిక్కెట్‌ మరికొంతమంది ఎన్నారైలకు కూడా ఖాయమని చెబుతున్నారు. మాడుగుల నియోజకవర్గం నుంచి ఎన్నారై పైలా ప్రసాదరావు, శృంగవరపు కోట నుంచి ఎన్నారై గొంప కృష్ణ, చింతలపూడి నుంచి మరో ఎన్నారై సొంగా రోషన్‌ కుమార్‌ ను నిలబెట్టాలని ఇప్పటికే టీడిపి అధినాయకత్వం నిర్ణయించినట్లు వార్త. అలాగే గుంటూరు ఎంపి సీటును ఎన్నారై డా. చంద్రశేఖర్‌ పెమ్మసానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే జాబితాలో వీరిపేరు ఉంటుందని ఎన్నారై టీడిపి నాయకులు చెబుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అందుకోసం అమెరికాలోని తెలుగుదేశం పార్టీ అభిమానులంతా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తారని ఎన్నారై టీడిపి కన్వీనర్‌ (అమెరికా) జయరాం కోమటి అన్నారు. ఇప్పటికే పార్టీ విజయం కోసం అమెరికాలోని వివిధ నగరాల్లో ఎన్నారై టీడిపి కమిటీలు, నాయకులు విజయంకోసం ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సురేష్‌ కాకర్ల

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా, ఉదయగిరి అసెంబ్లీ స్థానానికి టిడిపి జనసేన అభ్యర్థిగా అమెరికాకు చెందిన సురేష్‌ కాకర్ల పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేతలు  నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్‌ కళ్యాణ్‌  ప్రకటించిన సంగతి తెలిసిందే.  నార్త్‌ కరోలినా రాష్ట్రం, ర్యాలీ నగరానికి చెందిన సురేష్‌ కాకర్ల  రెండు సంవత్సరాల క్రితం అమెరికా నుంచి ఉదయగిరి అసెంబ్లీ పరిధిలో  పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కాకర్ల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ని ఏర్పాటుచేసి మహిళా సాధికారత కోసం వృత్తి విద్య నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్ధికంగా మరియు హార్దికంగా తోడ్పాటు, పాఠశాలలకు సహాయం, ఆరోగ్య శిబిరాలు, అణగారిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను దరిచేర్చడం వంటి వాటితో ఉదయగిరి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. తన విజయావకాశాలను మెరుగుపరుచుకున్నారు. సురేష్‌ కాకర్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లో కూడా  పలు పదవులను అధిరోహించడమే కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా అపలాచియన్‌ ప్రాంతంలో తానా విస్తరణకు కృషి చేశారు. ఆయనకు టిక్కెట్‌ లభించడం పట్ల పలువురు తానా నాయకులు, ఎన్నారై టీడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు.

గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెనిగండ్ల రాము 

ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, గుడివాడకు చెందిన వెనిగండ్ల రాము అమెరికాలో బిజినెస్‌ చేస్తూ మరోవైపు జన్మభూమికి సేవ చేయాలన్న తలంపులో వివిధ సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి టిడిపి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.   

వెనిగండ్ల ఫౌండేషన్‌ ద్వారా గుడివాడ లో ఇప్పటికే ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం, ఉద్యోగ మేళాలు, రైతు భరోసా, ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం వివిధ కార్యక్రమాలను చేస్తూ విజయాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. పలువురు తానా నాయకులు ఆయన గెలుపుకోసం ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :