MKOne TeluguTimes-Youtube-Channel

లోకేష్ పాదయాత్రలో పోలీసుల నిబంధనలు ఇవే...!

లోకేష్ పాదయాత్రలో పోలీసుల నిబంధనలు ఇవే...!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న నేపధ్యంలో పోలీసులు అనుమతి మంజూరు చేసారు. కుప్పం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్... నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి పోలీసుల అనుమతికి దరఖాస్తు చేయగా నేడు అనుమతి మంజూరు చేసారు. పాదయాత్ర, పబ్లిక్ మీటింగ్ అనుమతి కోసం దరఖాస్తు చేసారు. దీనిపై చిత్తూరు జిల్లా ఎస్పీ విశ్రాంత్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

దీని పై అన్ని పరిశీలించి పాదయాత్రకు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆయన. అనుమతిని ఇవ్వకముందే కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లలో అనుమతి ఇవ్వకుండా కక్షసాదింపుతో వ్యవహరిస్తున్నారని పోలీసులు మరియు ప్రభుత్వం పై నిందలు మోపుతున్నారు అని మండిపడ్డారు. వదంతులు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్ని పరిశీలించి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు ఎస్పీ.

ఇక పాదయాత్రలో పోలీసులు విధించిన నిబంధనలు ఒకసారి గమనిస్తే పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు. అలాగే బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని, రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి నిర్వాహకులు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స మరియు వైద్య పరికరాలతో అంబులెన్స్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలన్నారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ పేల్చడం పూర్తిగా నిషేధించబడిందని  తమ పార్టీ కార్యకర్తలు మరియు సమావేశంలో పాల్గొనేవారు సమావేశంలోకి ఎటువంటి మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిర్వాహకులు నిర్ధారించుకోవాలని సూచించారు. నిర్వాహకులు డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసారు. శాంతి భద్రతల నిర్వహణలో మరియు ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలని సూచించారు. ఈ నిబంధనలకు లోబడి పాదయాత్రను చేసుకోవాలని పేర్కొన్నారు.

 

Tags :