విలువైన ఓటును ప్రజలంతా విజ్ఞతతో వేయాలి: తెలంగాణ ఉద్యమ కారుడు, ఎన్.ఆర్.ఐ, టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఏనుగు

ఉచితాలు, ప్రలోభాలకు లొంగితే మన బిడ్డల భవిష్యత్ ను పణంగా పెట్టినట్లే
మంచి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా ఎన్నుకోవాలి, అదే ప్రజాస్వామ్యానికి బలం
మేధావుల మౌనం సమాజానికి మంచిది కాదు, జన చైతన్యానికి పాటు పడాలి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా విలువైన ఓటును విజ్ఞతతో వేయాలని పిలుపు నిచ్చారు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఎన్.ఆర్.ఐ, టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అనుగు.
ఉచితాలకు, ప్రలోభాలకు, డబ్బుకు ఓటును అమ్ముకుంటే మన తలరాతను, మన బిడ్డల భవిష్యత్ ను పణంగా పెట్టినట్లేనని ఆయన అభిప్రాయ పడ్డారు. ఉచితాలకంటే యువతకు నైపుణ్య అభివృద్ది ముఖ్యమని, ప్రస్తుతం పార్టీలు ఇస్తున్న హామీలు సమాజాన్ని చేతగాని విధంగా మార్చేలా ఉన్నాయని అన్నారు.
నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా అసమానతలు పోలేదని, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యంతో నిధులు, నీళ్లు, నియామకాలు అందేలా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. ఈ దిశగా మేధావుల మౌనం మంచిది కాదని అన్నారు. గతంలో అన్ని రకాలుగా క్రియాశీలకంగా ఉన్న మేధావులు ప్రస్తుతం మౌనంగా ఉండటం సమంజనం కాదన్నారు.
ఎన్నికల కమిషన్ కూడా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని లక్ష్మణ్ కోరారు. కేవలం డబ్బు స్వాధీనమే కాకుండా, ఎన్నికల చట్టాలని మరింత పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు అఫిడవిట్ లను సమర్పించిన నాయకులను తక్షణమే ఎన్నికల నుంచి బహిష్కరించేలా చూడాలన్నారు. గత ఎన్నికల్లో తప్పులు చేసి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఐదేళ్ల తర్వాత ఎన్నికల ముందు అనర్హులంటూ తీర్పులను రావటం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అన్నారు. కోట్లకు పడగలెత్తిన నాయకులు అపిడవిట్లలో తమకు సొంత కారు కూడా లేదంటూ ప్రకటించటం ప్రజలను అవమానించటమే అన్నారు. మంచి నాయకత్వం ఏపార్టీలో ఉన్నా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసి ఎన్నికోవాలని తద్వారా ప్రజాస్వామ్యం నిలబడుతుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు ఈ సారి ఎన్నికలను తప్పులు చేసే నాయకులకు గుణపాఠం నేర్పేలా వ్యవహరించాలని ఎన్.ఆర్.ఐల తరపున విజ్ఞప్తి చేశారు.
- లక్ష్మణ్ ఏనుగు






