అమెరికా పొరపాటుతో ఉక్రెయిన్ కు లబ్ధి

ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాల విలువను ఖాతా పుస్తకంలో 300 కోట్ల డాలర్ల మేరకు ఎక్కువ చేసి చూపడం జరిగిందని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి సబ్రినా సింగ్ వెల్లడించారు. ఈ పొరపాటును కనుగొనడం వల్ల ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను పంపే వెసులుబాటు కలిగింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తినప్పటి నుంచి ఇంత వరకు అమెరికా 3,700 కోట్ల డాలర్ల సైనిక సహాయాన్ని అందించింది. వివిధ ఆయుధాలు, మందుగుండు, సెన్సర్లు, రాడార్లు, ట్రక్కులను సరఫరా చేసింది. తాము అందిస్తున్న సహాయం పడకూడని హస్తాల్లో పడుతోందా, ఏమైనా అవినీతి జరుగుతోందా అని అమెరికా పార్లమెంటు సభ్యులు పదే పదే రక్షణ శాఖను ప్రశ్నిస్తున్నారు. తన దర్యాప్తులో ఇంతవరకు అలాంటిది జరిగిన దాఖలా లేదని గత ఫిబ్రవరిలో రక్షణ శాఖ ఇన్స్‌పెక్టర్ జనరల్ ప్రకటించారు. అంతలో ఉక్రెయిన్‌కు సరఫరా చేసిన ఆయుధాల విలువను గణించడంలో పొరపాటు జరిగిందని గుర్తించారు. అమెరికా పాత నిల్వల నుంచి ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపారు. అలా పంపేటప్పుడు ఆయుధాల ప్రస్తుత విలువను కాకుండా కొత్త ఆయుధాన్ని సేకరించడానికి అయ్యే ఖర్చును ఖాతా పుస్తకాల్లో చూపారు. దీంతో ఆయుధాల విలువ ఉన్నదాని కన్నా 300 కోట్ల డాలర్లు ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు ఆ విలువకు తగ్గ ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపడం వీలవుతుంది.