ASBL NSL Infratech

రివ్యూ : అణచివేతను ఎదిరించే 'పెదకాపు1'

రివ్యూ : అణచివేతను ఎదిరించే 'పెదకాపు1'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 2.5/5
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల తదితరులు.
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ : చోటా కె నాయుడు
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రాఫర్ : రాజు సుందరం
ఆర్ట్ : జిఎం శేఖర్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
విడుదల తేదీ: 29.09.2023

పెదకాపు  గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ వాసులకు పెదకాపు అంటే కాపు కులానికి సంబంధించిన వ్యక్తేనని ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. పెదకాపు కూరగాయల కొట్టు.. పెదకాపు పొగాకు కొట్టు.. పెదకాపు కాఫీ హోటల్..పెదకాపు రైస్ మిల్లు... వగైరా వగైరా ఇలా గోదావరి జిల్లాల్లో ఏ మూలన చూసిన పెదకాపులే దర్శనం ఇస్తారు. ఇప్పుడు అదే టైటిల్‌తో ‘పెదకాపు’ని బాక్సాఫీస్ బరిలో దింపారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా గోదారి జిల్లా వాడే కావడం.. పైగా కాపు బిడ్డ కూడా.. ఈ టైటిల్ కూడా అలా కనెక్ట్ అయ్యి ఉంటుంది కానీ.. పెదకాపు అనే కులానికి సంబంధించిన కాదని కాపుకాసే సాధారణ వ్యక్తి కథ అని దర్శకుడు వివరణ.  ఆ విషయాలన్నీ పక్కనపెడితే ఇంతకీ సినిమా ఎలా ఉందో. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో లేటెస్ట్ గా తీసిన “పెదకాపు”, సినిమా టైటిల్ ఫస్ట్ టీజర్ తోనే మంచి బజ్ ని అందుకున్నఈ చిత్రంతో కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. మరి ఈ చిత్రం పై  ప్రేక్షకుడి  అంచనాలు ఎలా ఉన్నాయో  సమీక్షలో చూద్దాం!

కథ :
కథ  1980 దశకం లో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన ‘తెలుగుదేశం పార్టీ’ ఆవిర్భావంతో నడుస్తుంది. గోదావరి జిల్లాలోని లంకగ్రామాలను శాసిస్తున్న సత్య రంగయ్య (రావు రమేష్), భైయన్నా (ఆడుకాలమ్ నరేన్)ల మధ్య వర్గపోరు ఉంటుంది. పరువు, పదవి కోసం ఊరి ప్రజల ప్రాణ, మానాలను తీసేస్తుంటాడు ఈ ఇద్దరు దుర్మార్గులు. ఏళ్లకి ఏళ్లుగా వీళ్ల ఆగడాలకు హద్దు, అదుపులేకుండా పోవడంతో ఊరు నిత్యం గొడవలు, రాజకీయ కక్షలకు కొలువుగా మారుతుంది. ఇలాంటి టైంలో అన్న ఎన్టీఆర్.. పార్టీని స్థాపించడంతో తరతరాలుగా బానిసత్వంలో మగ్గిపోయిన పెదకాపు (విరాట్ కర్ణ).. ఆ ఊరిలో తెలుగుదేశం పార్టీ జెండా పాతుతాడు. గ్రామం నడిబొడ్డున జెండా పాతి.. సత్య రంగయ్య, భైయన్నాలపై తిరగబడతాడు. ఈ పెదకాపు పోరాటంలో అక్కమ్మ (అనసూయ) పాత్ర ఏంటి? సాధారణ యువకుడికి ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడానికి దారితీసిన పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి? అన్నదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు :
ఈ చిత్రంతో పరిచయమైన విరాట్ కర్ణ సాలిడ్ పెర్ఫామెన్స్ ని డెలివర్ చేసాడు. డైలాగ్ డెలివరీకి కాస్త ఇబ్బంది పడినా...  తన పాత్ర ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పటికీ దానిని తన మొదటి సినిమా అయినా కూడా చాల మెచ్యూర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌‌లో విజృంభించాడు. అలాగే అనసూయ, రావు రమేష్, ప్రగతి శ్రీవాస్తవ లాంటి నటులు కూడా ఎవరికి వారే ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్ ని అందించారు.  అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ మరియు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ అంటేనే ఒక మార్క్ ఉంది. ఇపుడు ఇది అంతకు మించి అయితే ఉంటుంది. అంకమ్మ పాత్రతో అనసూయకి మంచి రోల్ పడింది. క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దం అని చెప్పిన అనసూయ కనిపించిన ఫస్ట్ సీన్‌లోనే అంకమ్మ అదరగొట్టేట్టు ఉందే అనేట్టు చేసింది.  ప్రగతి శ్రీ వాస్తవ కూడా కొత్త హీరోయిన్ అయినా సరే తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ పాత్రలమేరకు నటించారు.  

సాంకేతికవర్గం పనితీరు:
సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల.. ‘పెదకాపు’తో రూటు మార్చాడు. హీరోకి కత్తి ఇచ్చి రక్తపాతం సృష్టించాడు. అసలు కోనసీమ లాంటి ప్రశాంతమైన వాతావరణంలో మరీ ఈ స్థాయిలో రాజకీయ కక్షలు, హత్యలు ఉంటాయా అనేంతగా ఊచకోత కోయించాడు. బోయపాటి కానీ పూనాడా? అన్నంతగా.. పచ్చని కోనసీమలో రక్తపాతం సృష్టించేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఒక్కోసారి మనకి.. బోయపాటి సినిమా చేస్తున్నామా? లేదంటే.. శ్రీకాంత్ అడ్డాల సినిమాకి వచ్చామా? అనే అనుమానం కలుగుతుంది. అంత హింసాత్మకంగా ఉంటాయి సన్నివేశాలు.  కథ బాగానే మొదలుపెట్టారు కానీ.. కథనం ముందు సాగితే బాగుండు అనేట్టు చేశారు. కన్నబాబుగా శ్రీకాంత్ అడ్డాల.. విలన్ రోల్ చేశారు. కాళ్లు పడిపోయి.. కుర్చీలోనుంచి కదల్లేని స్థితిలో విలనిజం పండించే విలక్షణ పాత్ర చేయడానికి బాగానే కష్టపడ్డారు. ఫస్ట్ సీన్‌లోనే ఇతనేదో ఇరగదీసేట్టు ఉన్నాడే అనిపించారు కానీ.. ఆ తరువాత సింగిల్ ఎక్స్ ప్రెషన్స్‌తో నటుడిగా తేలిపోయారు. ఇక మిగతా టెక్నీకల్ టీం  అయితే  సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ చోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫీలు సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాయి. అలాగే డైలాగ్స్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:
అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం పెదకాపు... పోరాటం మొదలుపెట్టాడు కానీ, అతని గమ్యం ఏంటన్నది అతనికే కాదు చూసే ఆడియన్స్‌కి కూడా అర్ధం కాదు. పైనున్న వాడు కిందున్న వాడ్ని తొక్కడం, కిందున్న వాడు తిరగబడటం, కత్తి పట్టి రాజకీయ ప్రత్యర్ధిగా నిలబడం అనే పాయింట్ కొత్తదేమికాదు.  ఒకటి రెండు సీన్లు మినహాయిస్తే.. పెద్దకాపు నాయకుడిగా ఎదగడానికి బలమైన సీన్లు లేకుండా పోయాయి.  కానీ ఎన్టీఆర్ పార్టీతో ముడిపెట్టి కొత్తవాళ్లతో సరికొత్త ప్రయోగం చేశాడు దర్శకుడు.  ఇక హీరోయిన్ పుట్టక.. విలన్లతో ముడిపెట్టిన విధానం కాస్త కన్ఫ్యూజ్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య.. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం అటుంచితే.. వాళ్లిద్దరూ అసలు ప్రేమించుకుంటున్నారా? ప్రేమలో పడ్డారా? అనే కన్ఫ్యూాజన్‌లోనే ఉంటాయి. కథ పరంగా వాళ్లిద్దరికీ కనెక్టవిటీ కుదర్లేదు అని చెప్పాలి. కొంచెం స్లో నరేషన్ అక్కడక్కగా కొన్ని డిస్టబింగ్ సీన్స్ వంటివి అందరికీ ఈ సినిమా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఓవరాల్ గా మాత్రం మన ఒక సరికొత్త శ్రీకాంత్ అడ్డాల సినిమాగా ఒకసారికి ట్రై చేయవచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :