ASBL Koncept Ambience
facebook whatsapp X

ద్వారంపూడి తర్వాత పవన్ టార్గెట్ ఆయనేనా..?

ద్వారంపూడి తర్వాత పవన్ టార్గెట్ ఆయనేనా..?

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరి మూడు వారాలు దాటింది. చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెప్పినట్టుగానే మొదటి నెలలలోనే 7వేల పెన్షన్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో పోషించే పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన నిత్యం అధికారులతో భేటీ అవుతున్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. శాఖలపరంగా పట్టు పెంచుకునేందుకు అధికారుల నుంచి సమాచారం రాబడుతున్నారు.

బాధ్యతలు చేపట్టిన వెంటనే పవన్ కల్యాణ్ శాఖలపై అవగాహన పెంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శాఖల పనితీరుపై అధికారులతో చర్చలు జరిపారు. ఎక్కడైనా తనకు అనుమానం తలెత్తితే వెంటనే వాళ్లను ఆరా తీశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నలకు చాలా మంది అధికారులు బిత్తరపోయారు. గెలవక ముందు పవన్ కల్యాణ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. అడపాదడపా ఏపీలో అడుగుపెట్టి హడావుడి చేసి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయేవారు. గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా పని చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శాఖలవారీగా పలు అంశాలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలిలో జరిగిన పలు అవకతవకలను గుర్తించి వాటిని నిగ్గుతేల్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందు తనను తీవ్రంగా టార్గెట చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చారు. ద్వారంపూడికి చెందిన అక్వా పరిశ్రమకు నోటీసులు వెళ్లగా.., బియ్యం గోదాములు సీజ్ చేశారు. ఇప్పుడు ద్వారంపూడితో పాటు మరో వైసీపీ నేతపైన కూడా పవన్ కల్యాణ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

రాష్ట్రానికి సంబంధించి ఎర్రచందనం అరుదైన సంపద. అయితే కొంతమంది నేతలు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అటవీశాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎర్రచందనం అక్రమరవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించారు. తాజాగా పులివెందుల జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ బయటపడింది. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి డంప్ లు ఇంకా ఎక్కడున్నాయి.. ఎర్రచందనం రవాణా వెనుకున్న కింగ్ పిన్స్ ఎవరు.. రవాణా ఎలా చేస్తున్నారు.. కూలీలెవరు.. లాంటి సమాచారమంతా తనకు అందాలని పవన్ టార్గెట్ పెట్టారు. దీంతో పవన్ కల్యాణ్ ఇప్పుడు పెద్దిరెడ్డిపై దృష్టి పెట్టారని అందరూ అనుకుంటున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :