జనసేనకు కేంద్ర కేబినెట్‌లో ఎందుకు చోటు దక్కలేదు..?
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోదీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా పూర్తయింది. తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 71మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా ఐదుగురికి స్వతంత్ర హోదా దక్కింది. మరో 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు కూడా కేబినెట్లో సముచిత స్థానమే దక్కింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకు మాత్రం మోది మంత్రివర్గంలో స్థానం లభించలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 లోక్ సభ స్థానాలతో పాటు 164 అసెంబ్లీ స్థానాలను ఎన్డీయే పార్టీలు కైవసం చేసుకున్నాయి. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా గెలిచి వంద శాతం స్ట్రయిక్ రేట్ తో చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశంలో కూడా మోదీ.. పవన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.. అతను పవనం కాదని.. తుఫాన్ అని సంబోధించాడు. దీంతో పవన్ కు కేంద్రంలో కచ్చితంగా ప్రత్యేక ప్రయారిటీ ఉంటుందని అందరూ భావించారు.
మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా పవన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందువరసలోనే ఆయనకు చోటు దక్కింది. అయితే మోదీ కేబినెట్లో మాత్రం జనసేనకు ప్రాతనిధ్యం లబించలేదు. గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరికైనా కచ్చితంగా చోటు దక్కుతుందని అందరూ ఆశించారు. వల్లభనేని బాలశౌరికి మంత్రివర్గంలో ఛాన్స్ లభిస్తుందని జనసైనకులు అంచనా వేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. దీంతో అసలు జనసేనకు ఎందుకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఏపీ నుంచి ఈసారి 21 మంతి కూటమి సభ్యులు ఎంపీలుగా గెలిచారు. టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు ఇందులో ఉన్నారు. 16 మంది గెలిచిన టీడీపీకి 2 మంత్రిపదవులు దక్కాయి. బీజేపీకి 8 మంది ఉండగా ఒకరికి ఛాన్స్ దొరికింది. ఏపీకి మొత్తంగా 3 పదవులు దక్కాయి. ఇలాంటి పరిస్తితుల్లో జనసేనకు కూడా ఒక మంత్రిని కేటాయిస్తే ఒకే రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులుగా ఉంటారు. ఇది సముచితంగా ఉండదని భావించిన బీజేపీ అధిష్టానం జనసేనాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనికి పవన్ కల్యాణ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో తమ పాత్రపై తమకు పట్టింపులు లేవని.. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు బీజేపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రంలో జనసేనకు ప్రాతినిధ్యం లభించలేదు.