పాస్ పోర్టు సేవలు సులభతరం ... మరుసటి రోజుకే
విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో సేవలు సులభతరం అయ్యాయి. గతంలో పాస్ పోర్టు సంబంధిత సేవల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే 25 రోజుల తరువాత అవకాశం లభించేది. ఇప్పుడు ఈ సమయం గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కరోజు వ్యవధిలోనే అంటే మరుసటి రోజుకే స్లాట్ లభిస్తోందని పాస్ పోర్టు కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అదే విధంగా పాస్‌పోర్టు సేవా కేంద్రం ( పీఎస్‌కే)లో పత్రాలన్నీ సరిగ్గా సమర్పించే అదేరోజు పాస్‌పోర్టును మంజూరు చేస్తున్నామని అంటున్నారు. అదే పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా అయితే వారం రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు.
గతంలో మర్రిపాలెంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఏదైనా పని కోసం వెళితే అధికారుల అపాయింట్‌మెంట్ లభించేంది కాదు. గేటు దగ్గరే సెక్యూరిటీ ఆపేసేవారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఏ ఎంక్వయిరీ కోసమైనా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా కలవచ్చునని పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు తెలిపారు.