బీజేపీ ప్రచారానికి 3 వేల మంది ఇండో అమెరికన్లు : అడపా ప్రసాద్
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి ఎన్నుకోవాలంటూ భారత ఓటర్లకు ఫోన్ కాల్స్ ద్వారా విజ్ఞప్తి చేసే కార్యక్రమాన్ని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ రూపొందించింది. ఇందు కోసం 24కు పైగా బృందాలను నియమించింది. అలాగే భారత దేశం అంతటా బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి 3 వేల మందిపైగా ఇండో అమెరికన్ల బృందాన్ని పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బీజేపీ యూఎస్‌ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెలలో యూఎస్‌లోని 18 రాష్ట్రాల్లో 20-22 గరాల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సానుభూతిపరులు, వాలంటీర్లను మాత్రమే కాకుండా మోదీ-3.0 కోరుకుంటున్న సాధారణ ప్రజలను కూడా గుర్తించి ప్రచారంలో పాల్గొనేలా చేస్తాం. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎలా ఉందనేది ప్రజలకు వివరిస్తామన్నారు.
యూఎస్‌లోని నగరాలు, పట్టణాల్లో చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించడానికి కూడా కృషి చేస్తాం. మేము ఎన్నారై కుటుంబాలను కలిసి బీజేపీకి ఓటు వేయమని కోరుతాం. మేము ఇక్కడ కౌంటీ (జిల్లా)ల స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. వీటిని రాష్ట్రాలు, భాషల వారీగా విభజిస్తాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు తెలుగు మాట్లాడే వారితోనే కాల్స్ చేయిస్తాం అని తెలిపారు. అలాగే భారత్‌లో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనేందుకు 3 వేల మంది ఇండో అమెరికన్లను పంపేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.