అమరావతికి రూ.కోటి విరాళం : యడ్ల హేమప్రసాద్

రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్టు అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, ప్రవాసాంధ్రుడు డాక్టర్ యడ్ల హేమప్రసాద్ ప్రకటించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలోని చిలువూరు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పున: ప్రారంభించాక రూ.కోటి విరాళాన్ని అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతాయి. ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మైనేని రాంప్రసాద్, జక్కంపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.






