వైసీపీ కి మింగుడు పడని వెలక్కాయలా మారుతున్న నిమ్మగడ్డ..
కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ కు నిమ్మ గడ్డ పెద్ద తలనొప్పిగా మారుతున్నాడు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ ఆ తరువాత జగన్ ప్రభుత్వంలో కూడా కొంతకాలం పని చేశారు. నిమ్మగడ్డ టీడీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని వైసీపీ నేతలు విమర్శించారు. దీంతో జగన్ ప్రభుత్వంలో స్థానికల సంస్థల ఎన్నికలు అయిన తర్వాత నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో కనకరాజును ఎన్నికల కమిషనర్ గా నియమించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లి సైలెంట్ అయిపోయిన నిమ్మగడ్డ తాజాగా ఎలక్షన్ వాచ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ను వైసీపీ కు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసమే స్థాపించారు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. ఓటరు నమోదు దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఏ ఒక్క విషయాన్ని కూడా వదలకుండా తన సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల మీద ఆంక్షలు విధించడం వైసీపీ రెక్కలు విరిచినట్లు అయ్యింది. దీని వెనక కూడా నిమ్మగడ్డ హస్తం ఉంది. దీంతో ఇప్పుడు వైసీపీకి నిమ్మగడ్డ ప్రవర్తన మింగుడు పడడం లేదు.