ASBL NSL Infratech

తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..!

తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి పదేళ్లు. మొదటి తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవలే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదేనని కాంగ్రెస్ చెప్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పాలన ఉంటుందని ఆ పార్టీ హామీ ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం తప్ప రాష్ట్రం బాగుపడిందేమీ లేదని విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వ నామరూపాలను చెరిపేసి తమదైన చరిత్ర లిఖించేందుకు కాంగ్రెస్ సర్కార్ నడుం బిగించింది.

కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు పతనం అంచుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టారు కేసీఆర్. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పాలన చేజిక్కించుకుంది. పైగా ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడంతో ఆయన తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి పాలన చేపట్టారు. వెంటనే తాము ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిన వంద రోజుల్లో అమలు ప్రారంభించారు. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో స్పీడ్ తగ్గించారు.

ఇప్పుడు కోడ్ ముగుస్తుండడంతో రేవంత్ మళ్లీ దూకుడు పెంచారు. ముఖ్యంగా జూన్ 2న తెలంగాణ పదేళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాక తెలంగాణ రాజముద్రను మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి స్వరకల్పన చేయించాలని ఆదేశించారు. ఈ రెండింటిని ఆఘమేఘాలపై రెడీ చేసి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. అయితే తెలంగాణ గీతానికి కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేయించడం విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రుడైన కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేయించడమేంటని పలువురు తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు.

ఇప్పుడు రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ బొమ్మలను తొలగించి వాటి స్థానంలో అమరవీరుల స్థూపాన్ని చేర్చారు. కాకతీయ తోరణం, చార్మినార్ లు నియంత పాలనకు చిహ్నాలని కాంగ్రెస్ చెప్తోంది. అందుకే వాటిని తొలగించి అమరవీరుల స్మృతికి చిహ్నంగా స్థూపాన్ని చేర్చుతున్నట్టు చెప్తోంది. అంతేకాక రాజముద్రలో ఎరుపు, ఆకుపచ్చ రంగులను చేర్చడంతో అవి కాంగ్రెస్ రంగులనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలు ఆయన వైపు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో దూసుకుపోతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :