ASBL Koncept Ambience
facebook whatsapp X

కూటమి సర్కార్ కు హానీమూన్ కాలమిది..!

కూటమి సర్కార్ కు హానీమూన్ కాలమిది..!

కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీసీఎంగా పవన్, ఇతరమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాదు.. మంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు సహా పలువురు అప్పుడే పనుల్లో పడిపోయారు. వ్యవస్థల్ని సక్రమంగా నడిచేలా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ... తమ మార్కు పాలన చూపించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. అయితే ఇది హానీమూన్ టైమ్ కాబట్టి ప్రజలు సపోర్టుగానే ఉంటారు.

బాబు సర్కార్ పై భారీ ఆశలు..

గతంలో 151 సీట్లిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న వైసీపీ సర్కార్ ను..మీ పాలన బాలేదంటూ బండకేసి కొట్టారు.కేవలం 11 సీట్లతో వదిలిపెట్టారు. మరి రాష్ట్రం విషయంలో అంతపట్టుదలతో ఉన్న ప్రజలు.. చంద్రబాబు సర్కార్ నుంచి కూడా చాలానే ఆశిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పాలనాసామర్థ్యంపై ప్రజల్లో అత్యధికులకు ఎలాంటి అనుమానాల్లేవు. ఎందుకంటే ఆయన దేశంలోని సీనియర్ పొలిటీషియన్లలో ఒకరు. ఎన్నికల ప్రచార సభల్లో తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఘనంగా హామీలిచ్చారు. ప్రజలు వాటిని నమ్మి.. ఓటేసి గెలిపించారు. ఇక ఆ హామీలను అమలు చేయాల్సిన పరిస్థితులున్నాయి.

ఆర్థికవ్యవస్థను గట్టెక్కిస్తారా..?

చంద్రబాబు పాలన సామర్థ్యానికి అసలు పరీక్ష రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడం. ఆయన ఎలా చేస్తారన్నది ప్రజలకు అనవసరం. గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి తన తంటాలేవో తాను పడి ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.అంతే కానీ.. ఇప్పుడు మాదగ్గర గల్లాపెట్టెలో డబ్బు లేదు. లాంటి మాటల్ని ప్రజలు వినిపించుకోరు. కొద్దికాలం మాత్రం అవకాశమిస్తారు. తర్వాత ఇంకా అలాగే చెబితే.. ఎన్నికల హామీలిచ్చే ముందు ఇలాంటి విషయాలు గుర్తులేదా అని నిలదీసే ప్రమాదముంది.

పోలవరం పరీక్షే..?

రీ ముఖ్యంగా పోలవరం. ఏపీకి జీవనాడిగా చెబుతారు. దీన్ని పూర్తి చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు కూడా. ఆరునూరైనా ఎన్నికల ముందునాటికి ప్రాజెక్టు పూర్తి చేసి.. లక్షల ఎకరాలకు సాగునీరందించాలి. అలా చేస్తే.. చంద్రబాబు సర్కార్ కు ప్రజల నుంచి మరీ ముఖ్యంగా రైతుల నుంచి మంచి మార్కులే పడతాయి. చివరకు వచ్చేసరికి తూచ్ అనిపించారో.. ఈసారి వైసీపీకి పడిన దానికన్నా గట్టి దెబ్బే పడే అవకాశాలున్నాయి. ఈసంగతి నాలుగుసార్లు సీఎం చంద్రబాబుకు తెలియంది కాదు.

ప్రజా రాజధానిగా అమరావతి..

ఇక అమరావతి విషయంలో అక్కడి రైతుల నుంచి చంద్రబాబుకు మంచి మద్దతే లభించింది. ఇప్పుడు చంద్రబాబు..అమరావతి విషయంలో తాను చేస్తానన్నది చేసి చూపించాలి. అక్కడి రైతులకు అండగా నిలవడంతో పాటు రాష్ట్రప్రజలు కోరుకుంటున్నట్లు మంచి రాజధానిని నిర్మించేందుకు వేగంగా అడుగులేయాలి. లేదంటే మరో ఐదేళ్ల తర్వాత మళ్లీ ఏ ప్రభుత్వం వస్తుందో .. దాని ప్రాధాన్యాలేంటో తెలియదు. కాబట్టి తాము అధికారంలో ఉండగానే.. ఈ లక్ష్యాలను సాధించాలి. లేదంటే మరోసారి చంద్రబాబు సర్కార్ కు ఇబ్బందులు తప్పవు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :