పవన్‌పై ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఎందుకంత అక్కసు..?
ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా ఆయన ఇచ్చిన మాట మేరకు పేరు మార్చేసుకున్నారు. దీంతో ఆయన పేరు సర్వత్రా వినిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చేసుకున్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదలైంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలవడని.. ఒకవేళ గెలిస్తే తాను పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. అక్కడ పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన పేరు మార్చుకోక తప్పలేదు. అన్నట్టుగానే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. అయినా ఇప్పటికీ ఆయన తీరు మాత్రం మారలేదు.
రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు చాలా సహజం. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటారు.. మరికొంత మంది గుండు కొట్టించుకుంటానంటారు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుతుంటారు. ఒకవేళ ఓడినా వాటిని పెద్దగా పట్టించుకోరు. లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ముద్రగడ పద్మనాభం అలా కాదు. మొండివాడిగా ముద్రపడ్డారు. పేరు మార్చుకుంటానన్న ఛాలెంజ్ కు ఆయన కట్టుబడి పేరు మార్చేసుకున్నారు. ఒకవేళ ఆయన పేరు మార్చుకోకపోయినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే అందరి నాయకుల సవాళ్లు మరుగున పడితే ముద్రగడ సవాల్ మాత్రం ప్రధానంగా వార్తల్లో నిలిచింది.
ముద్రగడ సవాల్ పై పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ప్రధాన కారణం ఆయన పవన్ కల్యాణ్ పైన కామెంట్ చేయడమే. ఆయన ఇతర నేతలపైన అలా మాట్లాడి ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదేమో.! కానీ చేసింది పవన్ కల్యాణ్ పైన కాబట్టి జనసైనికులు ఊరుకోలేదు. ఆయన పేరు మార్చుకునేంత వరకూ వెంటాడారు. దీంతో ఆయన మార్చుకోక తప్పలేదు. అయితే ముద్రగడ పద్మనాభం తీరే ఇందుకు కారణమని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు, ఆయనకు అస్సలు సంబంధమే లేకపోయినా వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన జనసేనానిని టార్గెట్ చేశారు. దీంతో అసలు సమస్య మొదలైంది.
ముద్రగడ పద్మనాభ రెడ్డి అవకాశవాదం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కోసం పనిచేశారనే టాక్ ఉంది. తుని రైలు ప్రమాద ఘటన వెనుక ఆయన హస్తం ఉందని చెప్తుంటారు. ఆ సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఆ తర్వాత టీడీపీ ఓడిపోయి అధికారంలోకి రాగానే అస్సలు కాపు రిజర్వేషన్ల ఊసే ఎత్తలేదు. పైగా అధికారంలో లేని టీడీపీ, జనసేన పైన విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. చివర్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోయే సరికి జనసేనలో చేరేందుకు రెడీ అయిపోయారు. పవన్ కల్యాణ్ స్వయంగా తన ఇంటికొచ్చి ఆహ్వానించాలని భీష్మించుకు కూర్చున్నారు. అయితే పవన్ రాకపోయే సరికి మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అందుకే కాపులెవరూ ముద్రగడ పద్మనాభ రెడ్డి తీరును హర్షించట్లేదు. పైగా విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో పెట్టుకుని పెద్ద తప్పు చేశారని చెప్తున్నారు. మరి ఈ విషయం ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటారో..?