ASBL NSL Infratech

రివ్యూ : తెలుగు తెరపై సరికొత్త ప్రయోగం 'మిస్టర్ ప్రెగ్నెంట్'

రివ్యూ : తెలుగు తెరపై సరికొత్త ప్రయోగం 'మిస్టర్ ప్రెగ్నెంట్'

తెలుగుటైమ్స్.నెట్  రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : మైక్ మూవీస్, పంపిణీ దారులు : మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్,  
నటీనటులు : సయ్యద్ సొహైల్ ర్యాన్, రూపా కొడువయూర్, సుహాసిని మణిరత్నం,
వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్ రెడ్డి బొబ్బ, రాజా రవీంద్ర తదితరులు
ఛాయాగ్రహణం : నిజార్ షఫీ, సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: గాంధీ నడికుడికర్
నిర్మాతలు - అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నప రెడ్డి
రచన, దర్శకత్వం : శ్రీనివాస్ వింజనంపాటి
విడుదల తేదీ: 18.08.2023

బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పండించిన సొహెల్ వెండి   ఈ సంవత్సరం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, 'లక్కీ లక్ష్మణ్'  అంటూ వెండి తెరపై కూడా వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు. ఆ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే  ఇప్పుడు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సరికొత్త  ప్రయోగాత్మక చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక మగాడు గర్భం మోయడం అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌ను ఎమోషనల్‌గా కట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా కలిగాయి. చిత్ర బృందం  భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో? మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారో సమీక్ష లో చూద్దాం!

కథ:

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గౌతమ్ (సయ్యద్ సోహైల్ ర్యాన్) అనాథగా పెరుగుతాడు. టాటూలు వేయడంలో ఎక్కడ ఏ కాంపిటీషన్ జరిగినా ఫస్ట్ ప్రైజు అతనికే వస్తుంటుంది.  మహి (రూపా కొడువయూర్) గౌతమ్‌ను చాలా డీప్‌గా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం మహిని అస్సలు పట్టించుకోడు. ఒకరోజు గౌతమ్ పార్టీలో ఫుల్లుగా తాగేసి జీవితాంతం పిల్లలు వద్దనుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని మహికి కండీషన్ పెడతాడు. దాన్ని సీరియస్‌గా తీసుకుని మహి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతుంది. మహికి తన మీదున్న ప్రేమను అర్థం చేసుకున్న గౌతమ్... లవ్‌కు ఓకే అంటాడు. కానీ మహి తండ్రి (రాజా రవీంద్ర) వ్యతిరేకిస్తాడు. దీంతో మహి ఇంట్లో నుంచి వచ్చేసి గౌతమ్‌ను పెళ్లి చేసుకుంటుంది. అయితే తనకిష్టానికి వ్యతిరేకంగా గర్బవతి కావడంతో మహినీ దూరంగా పెడుతాడు. ఆ తర్వాత మనసు మార్చుకొని ఆమె గర్బాన్ని తన కడుపులో పెంచుకోవడానికి గౌతమ్ నిర్ణయం తీసుకొంటాడు. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కు తనే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? గౌతమ్‌కు పిల్లలంటే ఎందుకు ఇష్టం ఉండదు? చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకొన్న ప్రభావం గౌతమ్‌పై ఎలా పడింది? ప్రకృతికి విరుద్ధంగా భార్య మహీ గర్బాన్ని గౌతమ్ ఎందుకు మోయాలనుకొన్నాడు? గౌతమ్ గర్బాన్ని మోసే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? సమాజం పెట్టిన ఇబ్బందులను అవమానాలను  గౌతమ్ ఎలా ఎదురించాడు?. ఈ కథలో డాక్టర్ వసుధ (సుహాసిని మణిరత్నం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

సయ్యద్ సోహైల్ గత రెండు సినిమాల్లో ఫెర్ఫార్మెన్స్ విషయంలో కథల ఎంపికలో కాస్త తడబాటు కనిపించింది. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో మాత్రం ఫుల్ మెచ్యురిటీతో గౌతమ్ పాత్రలో అదరగొట్టాడు. 9 నెలలపాటు గర్బాన్ని మోసే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఓ సన్నివేశంలో నేను చనిపోతే.. నాకు పుట్టే బిడ్డకు నా తల్లి పేరు పెట్టండి అంటూ చెప్పిన డైలాగ్‌తో కంటతడి పెట్టించేంతగా నటించాడు. సెకండాఫ్‌ సినిమా భారాన్నంతా సోహైల్ తన మీద వేసుకొని సినిమాను నడిపించిన విధానం బాగుంది. మాస్, క్లాస్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మహీ పాత్రలో మరోసారి రూపా కొడువాయుర్ తన ప్రతిభతో ఆకట్టుకొన్నారు. అందం, అభినయాన్ని బ్యాలెన్స్ చేసి మంచి మార్కులే కొట్టేసిందని చెప్పాలి. ఇక సుహాసిని ఓ డిగ్నిఫైడ్ క్యారెక్టర్‌లో కనిపించడమే కాకుండా భావోద్వేగాన్ని పండించారు. వైవా హర్షా ఎమోషనల్, కామెడీ అంశాలను బ్యాలెన్స్ చేసి నటుడిగా మెప్పించే ప్రయత్నం చేశారు. బ్రహ్మాజీ, అభిషేక్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకు హైలెట్.  రాజా రవీంద్ర, అలీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఎంచుకొన్న పాయింట్, దానిని కథగా విస్తరించిన తీరు కొత్తగా వుంది. అయితే ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నాడు. ఒక్కసారి ఆటో సీన్ కథలోకి వచ్చిన తర్వాత సినిమా పరుగులు పెట్టేలా చేసింది. భావోద్వేగమైన అంశాలు, ఫ్లాష్ బ్యాక్‌ సన్నివేశాలను దర్శకుడు ఎమోషనల్‌గా రాసుకొన్న తీరు ఆకట్టుకొనేలా చేసింది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాలు ఈ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సన్నివేశాలకు తగినట్టుగా లైటింగ్‌ను వాడుకొన్న విధానం బాగుంది. ఆర్టిస్టుల ఎమోషన్స్ చక్కగా కెమెరాలో బంధించడంలో నిజార్ షఫీ తన సత్తాను చాటుకొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. పాటలు అంతగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ ఆరంభంలో ఎడిటింగ్ కొంత అటు ఇటుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఎక్కడ ల్యాగ్ లేకుండా సన్నివేశాలు పరుగులు పెట్టించింది. నిర్మాతలు అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఎంచుకొన్న కథ వారికి సినిమాపై ఉన్న అభురుచిని తెలియజేసింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించదు.

విశ్లేషణ:

సినిమా చాలా సాధారణంగా మొదలవుతుంది. గౌతమ్‌ను మహి ప్రేమించడం, గౌతమ్ పట్టించుకోకుండా తిరగడం, వైవా హర్ష కామెడీ ట్రాక్ ఇలా సాగుతూనే ఉంటాయి. మహిని గౌతమ్ ఎందుకు ప్రేమించాడనే విషయాన్ని చాలా బలంగా, కనెక్ట్ అయ్యేలా చెప్పారు. కానీ గౌతమ్‌ని మహి ఎందుకు అంతగా ఇష్టపడిందో అన్న క్లారటీ ఇవ్వలేదు. మొదటి 45 నిమిషాల్లో కథ అస్సలు ఏమాత్రం ముందుకు సాగదు. అక్కడి దాకా జరిగిన కామెడీ సీన్లు పెద్దగా నవ్వించవు. ఒక విలన్‌ని పరిచయం చేసినా ఆ పాత్ర ఆటలో అరటిపండు లాంటిదేనని అర్థం అవుతూనే ఉంటుంది. హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న దగ్గరి నుంచి స్టోరీ గ్రాఫ్ మారిపోతుంది. అసలు గౌతమ్ పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నాడు అనే విషయాన్ని ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో కూడా గ్రాఫ్ ఏమాత్రం పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. సున్నితమైన అంశాలను ఎమోషనల్‌గా చెప్పిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ సినిమా నవ్విస్తుంది.. బాధపెడుతుంది. భావోద్వేగానికి గురిచేస్తుంది. ఎక్కడా ఎవరిని నిప్పించకుండా ప్రజెంట్ చేసిన  క్లీన్ చిత్రం  ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. పక్కాగా ఫీల్ గుడ్  అనిపించే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. "ఈ చిత్రం అమ్మతనానికి అంకితం అని చెప్పొచ్చు".  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :