ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'మామ' వారసుడిగా..

'మామ' వారసుడిగా..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ వారసుడిగా పగ్గాలను మోహన్ యాదవ్‌కు అప్పగించారు. ఇప్పటివరకూ శివరాజ్ సింగ్ చౌహాన్ తాత్కాలిక సీఎంగా కొనసాగగా.. ఇకపై మోహన్ ఆ బాధ్యతల్ని చేపట్టనున్నారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యామంత్రిగా ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన పేరుని ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆమోదించారు.

1965 మార్చి 25వ తేదీన ఉజ్జయినిలో మోహన్ యాదవ్ జన్మించారు. B.Sc, LLB, రాజకీయ శాస్త్రంలో MA, MBA, PhD వంటి ఉన్నత విద్యల్ని అభ్యసించారు. ఏబీవీపీతో అనుబంధం కలిగి ఉన్న మోహన్.. 1982లో మాధవ్ సైన్స్ కళాశాల విద్యార్థి సంఘానికి సహ కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1984లో దాని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాదిలో ఏబీవీపీ ఉజ్జయిని నగర మంత్రిగా, 1986లో శాఖాధిపతిగా ఎన్నికయ్యారు. 1988లో మధ్యప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర సహకార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 1989-90లో ఏబీవీపీ రాష్ట్ర శాఖకు రాష్ట్ర మంత్రిగా, 1991-92లో మండలి జాతీయ మంత్రిగా వ్యవహరించారు.

1993-95 వరకు మోహన్ ఉజ్జయిని నగరంలో RSS సహ-విభాగ కార్యదర్శిగా.. 1997లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా.. 1998లో పశ్చిమ రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యునిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. 2000-2003 మధ్యకాలంలో ఉజ్జయిని విక్రమ్ యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, బీజేపీ నగర జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన.. 2004లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2010 మధ్య కాలంలో ఉజ్జయిని డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చారు. 2011-2013 మధ్య కాలంలో BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు.

2013లో ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 2020 జులై 2వ తేదీన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించారు. ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. జగ్బీర్ దేవరా, రాజేంద్ర శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. ఇక నరేంద్ర సింగ్ తోమర్‌ స్పీకర్‌గా వ్యవహరిస్తారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :