రివ్యూ: వందశాతం నవ్వులు పండించిన 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: యువి క్రియేషన్స్
నటి నటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయ సుధ, తులసి, మురళి శర్మ, అభినవ్ గోమాటం, సోనియా దీప్తి తదితరులు...
సంగీతం : రధన్ (పాటలు)
నేపధ్య సంగీతం : గోపి సుందర్,
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందా
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీ రామ్,
నిర్మాతలు: వి వంశీ కృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి,
రచనా, దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగోల్ల
విడుదల తేదీ: 07.09.2023
సక్సెస్ ఫుల్ మూవీ 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత టాప్ స్టార్ హీరోయిన్ 'దేవసేన', అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా చూసి "తొలి ప్రేక్షకుడ్ని నేనే.. వందశాతం ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు" అని మెగాస్టార్ చిరంజీవి కితాబు ఇవ్వడం, ప్రభాస్, రాంచరణ్ ల ట్విట్టర్ పోస్టుల ద్వారా సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేయడం, వగైరా వగైరా ఈ చిత్రాన్ని హైప్ క్రియేట్ చేసాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. మరి ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం!
కథ:
అన్విత రవళి పోలిశెట్టి (అనుష్క శెట్టి ) లండన్‌లో మాస్టర్ చెఫ్. పెళ్లి చేసుకునే వయసు దాటేసినా.. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండిపోతుంది. దానికో కారణం కూడా ఉంటుంది. తన తల్లి (జయసుధ) ప్రేమించి మోసపోవడంతో.. ప్రేమ పెళ్లిళ్ల పై అన్వితకు నమ్మకం ఉండదు. పెళ్లి చేసుకోమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా అన్విత ససేమీరా అంటుంది. తల్లి కి క్యాన్సర్ వచ్చి కన్నుమూయడంతో ఒంటరౌతుంది అన్విత. ‘‘పోతున్న ప్రాణాన్ని పట్టుకునే చేయి తోడు కావాలి.. నీకు నేనున్నా.. కానీ నీకు ఎవరూ లేరు’’ అని పోతూ పోతూ తల్లి చెప్పిన మాటతో అన్వితలో ఆలోచన మొదలౌతుంది. అన్నీ తానై పెంచిన అమ్మలేని లోటుని తాను అమ్మగా తీర్చుకోవాలనుకున్న ‘ మిస్ శెట్టి’కి.. ఎదురౌతాడు మిస్టర్ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి )అలియాస్ సిద్దు. మిస్ శెట్టి తల్లి కావాలనుకున్నది పెళ్లి చేసుకుని శారీరక సంబంధంతో కాదు. వీర్యదాన వ్యవహారం ద్వారా తల్లి కావాలనుకుంటుంది. ఆ క్రమంలో మిస్టర్ పోలిశెట్టి దొరికేశాడు. ఆ తరువాత ఈ వీర్యదాన వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగిందన్న గమ్మత్తైన కథే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. వీర్యదాన వ్యవహారం తో మిస్ శెట్టితో పరిచయం అయిన మిస్టర్ పోలిశెట్టి తనకంటే పెద్దదైన మిస్ శెట్టి ప్రేమలో పడతాడా?. మిస్టర్ శెట్టి ద్వారా మిస్ శెట్టి తల్లి అవుతుందా లాంటి వాటికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే!
నటి నటుల హావభావాలు:
అనుష్కకి బాహుబలి, భాగమతి తరువాత మంచి కమ్ బ్యాక్ మూవీ. అన్విత రవళి పాత్రకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మరీ గతంలో కనిపించిన దేవసేన లాంటి అనుష్కతో పోల్చుకుంటే.. ఇలా ఉందేంటి అని అనిపించొచ్చు కానీ. తల్లి కావాలనుకునే యువతి ఆమె వయసుకు తగ్గ పాత్రకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. బొద్దుగా కనిపించినా.. సెకండాఫ్‌లో ఆమె ప్లే చేసిన బరువైన భావోద్వేగ సన్నివేశాలలో ఆమె అలా ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక కామెడీలో ఆరితేరిన నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించడం కాదు జీవించేశాడు. మైక్ పట్టుకుని అతను నవ్విస్తుంటే.. ఏదో నిజంగానే మన ముందు కామెడీ షో చేస్తున్నట్టుగానే ఉంటుంది. సిద్దు అనే స్టాండప్ కమెడియన్ పాత్రను నవీన్ పోలిశెట్టి కోసం ఊహించుకునే రాసి ఉంటాడేమో దర్శకుడు అన్నంతగా ఆ పాత్రలో ఇమిడిపోయాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాలో ఆ సీనియర్ బ్యూటీ నటి అనుష్క ని సైతం డ్యామినేట్ చేసేశాడు. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజస్కంధాలపై నిలబెట్టాడు. తనకిచ్చిన పాత్రకి జీవం పోయడానికి సిద్దు పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేషాల్లో ఎమోషన్స్‌తో పిండేశాడు. అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడిగా.. స్టాండప్ కమెడియన్‌గా.. ప్రేమికుడిగా.. డిఫరెంట్స్ షేడ్స్ చూపించాడు నవీన్ పోలిశెట్టి. జయసుధ కనిపించేది రెండు సీన్లలో అయినా గుర్తుండి పోయే పాత్ర ఆమెది. అయితే బాలయ్యకి వీరాభిమానిగా జయసుధని చూపించారు. ఇక మురళీ శర్మ, తులసిలు హీరో పేరెంట్స్‌గా ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫ్రెండ్‌గా సోనియా దీప్తికి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. హీరో ఫ్రెండ్‌గా అభినవ్ గోమఠం ఆకట్టుకున్నాడు.
సాంకేతికవర్గం పనితీరు:
సింపుల్ కథను ట్రెండీగా చూపించారు దర్శకుడు మహేష్ బాబు. వీర్యదానం అనే సింపుల్ పాయింట్‌కి వినోదాత్మకంగా మలచడంలో సక్సెస్ అయ్యారు. స్టార్ హీరోయిన్ అనుష్క వంటి పవర్ ఫుల్ క్యాస్టింగ్ తో ఆమెను మిస్ పోలిశెట్టిగా డీసెంట్ పాత్రలో చూపించాడు. మిస్ శెట్టిగా అనుష్క శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిగా నవీన్ పోలిశెట్టి కాకుండా వేరే వాళ్లు చేసి ఉంటే మాత్రం రిజల్ట్ మరో విధంగా ఉండేది. అంతటి పర్ఫెక్ట్ గా జోడీని సమకూర్చుకున్నారు దర్శకుడు. ఐటమ్ సాంగ్‌లు, రొమాంటిక్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జోలికి పోకుండా ‘స్పెర్మ్ డొనేషన్’ అనే కామన్ పాయింట్‌కి స్టాండప్ కామెడీ జోడించి ఆడియన్స్‌కి కనెక్ట్ చేశారు దర్శకుడు. కథలో భాగంగా సాంగ్స్ వున్నాసంగీత దర్శకుడు రధన్ పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక గోపీ సుందర్ నేపథ్య సంగీతం బాగుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది ఫారిన్ విజువల్స్ సినిమాకి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చాయి. ఎడిటింగ్ లో ఎలాంటి మార్పు లేదు. యువి క్రియేషన్స్ నిర్మాణపు విలువలు గ్రాండ్ గా వున్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమాలో బలమైన సన్నివేశాలు, గుండెల్ని హత్తుకుని మెలిపెట్టే భావోద్వేగ సంభాషణలు లాంటివి లేకపోయినా ‘నిన్ను నమ్మిన తోడు దొరికినప్పుడు వెనకడుగు వేయొద్దు’.. ‘పోతున్న ప్రాణాన్ని పట్టుకునే చేయి తోడు కావాలి’.. వంటి చిన్న చిన్న డైలాగ్స్ తో ఆకట్టుకునేట్టులా వుంది. సినిమాని సందేశాత్మకంగా చూపించాలనుకున్నారు అయితే వినోదంగా సాగిన కథలో ఎక్కడా బోరింగ్ లేకుండా అంతర్లీనంగా చిన్న మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా కథకి ఈడు జోడు సెట్ కాకపోవడమే పెద్ద ఎస్సెట్. చూడ్డానికి అనుష్క.. నవీన్ పోలిశెట్టికి అక్క మాదిరే ఉందే అనుకోవడమే ఈ చిత్రానికి ప్లస్. బి సి సెంటర్లలో ఈ సినిమా ఎక్కకపోవచ్చు కానీ.. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నిలుస్తుంది.






